మహిళల ప్రపంచ కప్ టోర్నీ నుంచి టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. కాగా, ఈ ఓటమికి కారణం చివరి ఓవర్లో పడిన ఒకే ఒక్క నో బాల్. ఆ ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సిన పరిస్థితిలో ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ కీలక బాధ్యతను తీసుకుంది. తొలి రెండు బంతుల్లో రెండు పరుగులు, మూడో బంతికి వికెట్ పడడంతో మ్యాచ్ భారత్ వైపే ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాతి బంతికి 1పరుగు రాగా.. ఇక ఐదో బంతికి నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. బ్యాటర్ గాల్లోకి షాట్ ఆడగా హర్మన్ ప్రీత్ అమాంతం క్యాచ్ అందుకుంది. దీంతో భారత్ గెలిచినట్లే అని సంబరపడుతున్న వేళ అంపైర్ నోబాల్ ప్రకటించడంతో ఆశలన్నీ ఆవిరయ్యాయి. భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.