నోకియా వార్షిక ‘మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇండెక్స్ (MBiT) నివేదిక 2022’ ప్రకారం సగటు నెలవారీ డేటా ట్రాఫిక్ 26.6 శాతం (సంవత్సరానికి) పెరిగింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో గత ఐదేళ్లలో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సబ్స్క్రైబర్లు 345 మిలియన్ల నుంచి 765 మిలియన్లకు పెరిగారు. ప్రస్తుతం మొబైల్ డేటా వినియోగంలో ప్రతి వినియోగదారుడు నెలకు 17GBకి చేరుకుందని కొత్త నివేదిక వెల్లడించింది. 2021లో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ డేటాలో భారతదేశం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 2021లో దాదాపు 40 మిలియన్ల సబ్స్క్రైబర్లు పెరిగి, 4G సేవలకు అప్గ్రేడ్ అయ్యారని నివేదిక వెల్లడించింది. మొబైల్ బ్రాడ్ బ్యాండ్ అభివృద్ధి చేందడంలో 4G కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ నివేదిక ప్రకారం భారతీయ యువత రోజుకు సగటున 8 గంటలు ఆన్లైన్లో గడుపుతున్నారు. 2025 నాటికి స్మార్ట్ఫోన్ వినియోగదారుల సంఖ్య 60-75 శాతానికి పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.