ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెడతామని, విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తామని చెప్పారు.మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం మొదటి దశ కింద రూ. 3,497.62 కోట్లు ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు విద్యాశాఖ మార్చి 14 నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.