రష్యా దాడులతో అతలాకుతలమైన ఉక్రెయిన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 770 మంది విద్యార్థుల్లో ఒక్కరు తప్ప మిగిలిన వారందరినీ విజయవంతంగా తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఆపరేషన్ గంగాలో భాగంగా ఫిబ్రవరి 26న తరలింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు అందరూ ఇళ్లకు చేరినట్లు తెలుస్తోంది. అయితే, ఒక విద్యార్థి మాత్రం స్వదేశానికి వెళ్లే పరిస్థితిపై ఇంకా క్లారిటీ రాలేదు. “మేము అతనికి ఇమెయిల్ పంపాము, కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రతిస్పందన రాలేదు” అని రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు బాబు అహమ్మద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, సుమీ నుంచి వచ్చిన విద్యార్థుల్లో ఆరుగురు తెలంగాణ వాసులుగా గుర్తించారు. అందులో ఒక విద్యార్థి కుటుంబాన్ని సందర్శించడానికి ఉక్రెయిన్ నుంచి పోలాండ్‌కు వెళ్లగా, మరొకరు అక్కడే ఉండటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.