ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర పోరు నానాటికీ తీవ్రతరమవుతోంది. వేల సంఖ్యలో సైనికులు, సామాన్య ప్రజలు మరణిస్తున్నారు. ఇప్పటివరకు 9 వేల మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టినట్లుగా ఉక్రెయిన్ ప్రకటించింది. అంతేగాక, రష్యన్ యుద్ద ట్యాంకులను, వందల సంఖ్యలో సాయుధ శకటాలను, పదుల సంఖ్యలో విమానాలను హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. వేలల్లో సామాన్య ప్రజలు బలయ్యారు. తమ సైనికులు మరణించినట్లుగా రష్యా కూడా ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయినా, రష్యా మాత్రం పట్టువిడవకుండా ఉక్రెయిన్ పై దాడులు జరుపుతోంది. ఇప్పటికే ఖేర్సన్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకోగా.. కీవ్, ఖార్కీవ్ నగరాలను కూడా వశం చేసుకొని ఉక్రెయిన్ పై ఆధిపత్యం చెలాయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.