YouSay Short News App

INDvsSL: రెండో టీ20లో పోరాడి ఓడిన భారత్

ఉత్కంఠ పోరులో భారత్ పోరాడి ఓడింది. శ్రీలంకపై 16 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. టాప్ ఆర్డర్ విఫలమైనా మధ్య ఓవర్లలో భారత బ్యాట్స్‌మన్ చెలరేగారు.

భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ చేతులెత్తేశారు. ఇషాన్ కిషన్(2), గిల్(5), త్రిపాఠి(5), హార్దిక్ పాండ్యా(12), దీపక్ హుడా(9) వరుసగా పెవిలియన్ బాట పట్టారు.

భారత్ ఇన్నింగ్సులో అక్షర్ పటేల్(31బంతుల్లో 65) ఆటే హైలైట్. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగుకి వచ్చి వీరుడిలా పోరాడాడు. సూర్యకుమార్(51) రాణించాడు.

శ్రీలంక బ్యాట్స్‌మన్ అదరగొట్టారు. ఓపెనర్లు జట్టుకు అదిరే శుభారంభాన్ని ఇచ్చారు. కుశాల్ మెండిస్(52), పాతుమ్ నిశాంక(33) కలిసి 8 ఓవర్లలో 80 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ప్రమాదకరంగా మారుతున్న వీరి భాగస్వామ్యాన్ని చాహల్ విడదీశాడు. డీఆర్ఎస్ కోరి టీమిండియా మెండిస్ వికెట్‌ని రాబట్టింది. ఆ తర్వాత అసలంక(19 బంతుల్లో 37) చెలరేగి ఆడాడు.

కిందటి మ్యాచులో భయపెట్టిన కెప్టెన్ దసున్ శానక మరోసారి చెలరేగిపోయాడు. 22 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో ఏకంగా 3 సిక్సులు బాది 20 పరుగులు రాబట్టాడు.

భారత బౌలర్లు తేలిపోయారు. శివం మావి 53 పరుగులు, ఉమ్రాన్ మాలిక్ 48 పరుగలు, అర్షదీప్ 2 ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్నారు. అక్షర్, చాహల్, హార్దిక్ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు తీసుకోగా, అక్షర్ పటేల్ 2, చాహల్ 1 వికెట్ తీశారు.

స్కోర్లు: శ్రీలంక 206/6 (20); భారత్ 190/8 (20)