YouSay Short News App

IND vs SL: తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం

శ్రీలంకతో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి 1-0 తో సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత్.. భారీ స్కోరు చేసింది. 50 ఓవర్లకు 373 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది.

భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలోకి వచ్చిన లంక బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. కెప్టెన్ దాసున్ శనక అజేయ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. దీంతో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీమిండియాకు ఓపెనర్లు రోహిత్(83), గిల్(70) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలివికెట్‌కి 143 పరుగులు జోడించారు.

కింగ్ కోహ్లీ శ్రీలంకపై సెంచరీని నమోదు చేసి రికార్డులను బద్దలు కొట్టాడు. 87 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి.

వన్డేల్లో కోహ్లీకి ఇది 45వ సెంచరీ. అన్ని ఫార్మాట్లలో కలుపుకొంటే విరాట్‌కు 73వ అంతర్జాతీయ సెంచరీ. సచిన్(100) తర్వాత రెండో స్థానంలో ఉన్నది కోహ్లీనే.

వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సెంచరీలు(20), ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు(9) చేసిన ఆటగాడిగా విరాట్.. సచిన్‌ రికార్డును సమం చేశాడు.

సచిన్ తెందుల్కర్ కూడా భారత్‌లో 20 సెంచరీలు నమోదు చేశాడు. కానీ, మాస్టర్ బ్లాస్టర్ 166 ఇన్నింగ్సుల్లో ఈ ఫీట్ సాధిస్తే.. కింగ్ కోహ్లీ కేవలం 99 ఇన్నింగ్సుల్లోనే చేయడం గమనార్హం.

వన్డేల్లో ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగానూ విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును సమం చేశాడు. వెస్టిండీస్, శ్రీలంకలపై 9 సెంచరీలు చేశాడు.

శ్రేయస్ అయ్యర్(28), కేఎల్ రాహుల్(39) రాణించారు. వీరితో కలిసి విరాట్ ఇన్నింగ్స్‌ని భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు.

భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్(3/57), సిరాజ్(2/30) రాణించగా.. చాహల్, పాండ్యా, షమి ఒక్కో వికెట్ తీసుకున్నారు.

టీమిండియా పేసర్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచులో గంటకు 156కి.మీ వేగంతో బంతిని విసిరి.. టీమిండియా తరఫున అత్యంత వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు.

శ్రీలంక 300కు పైగా స్కోరు చేయడానికి కెప్టెన్ దాసున్ శనకనే కారణం. ఓ వైపు వికెట్లు పడుతున్నా మ్యాచ్ బాధ్యతను భుజాన వేసుకుని శనక 88 బంతుల్లో 108 పరుగులు చేసి చివరి వరకు పోరాడాడు.

వన్డేల్లో ప్రత్యర్థి జట్టుపై 300కు పైగా స్కోరు సాధించడంలో టీమిండియా రికార్డు సృష్టించింది. 22 సార్లు శ్రీలంకపై ఈ ఘనత సాధించింది.

స్కోర్లు: భారత్ 373/7 (50), శ్రీలంక 306/8 (50) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: విరాట్ కోహ్లీ.