ALLARI NARESH :  అల్లరి నరేష్ కేరీర్‌లో ఎప్పటికీ  గుర్తుండే రోల్స్ ఇవే…

YouSay Short News App

కామెడీ యాక్టర్‌గా పాపులర్ అయిన అల్లరి నరేష్.. ఈ మధ్య వరుసగా సీరియస్ రోల్స్ చేస్తున్నాడు. తాజాగా నరేష్ నటించిన ‘ఉగ్రం’ సినిమా టీజర్‌లోనూ ఇది స్పష్టంగా కనిపించింది.

కామెడీ చేసి కడుపుబ్బా నవ్వించే అల్లరి నరేష్… విభిన్న పాత్రలను పోషించి మెప్పించగలడు. అందుకు ఆయన చేసిన కొన్ని సినిమాలే నిదర్శనం. అల్లరి నరేష్ చేసిన ఆ రోల్స్ ఏంటో చూద్దాం.

వినోద్(నేను)

తొలిసారిగా నరేష్‌లోని నటుడిని పరిచయం  చేసిన సినిమా ‘నేను’. ఫ్రెండ్‌ని ప్రేయసిలా భావించే  ఓ ఇంట్రోవర్ట్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. మనసులోని ఆవేదనని కళ్లలో చూపించి కంటతడి పెట్టించాడు. ఈ సినిమాలో నరేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

గాలి శీను(గమ్యం)

తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోయే పాత్ర ఇది. నమ్మి వచ్చిన స్నేహితుడి కోసం ప్రాణాలైనా అర్పించొచ్చనడానికి ఈ పాత్ర నిదర్శనంగా నిలిచింది. నరేష్ నటనకు నంది అవార్డు కూడా లభించింది.

రవి వర్మ(విశాఖ ఎక్స్‌ప్రెస్)

అల్లరి నరేష్ విలన్‌గా చేసిన పాత్ర ఇది. తన నటనతో ప్రేక్షకులను భయపెట్టించాడు.

మల్లి(శంభో శివ శంభో)

ప్రేమికులను కలిపేందుకు తపనపడే ఓ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ నటించాడు. ఇందులో నరేష్ నటనకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తన అమాయకత్వంతో నవ్విస్తూనే.. కంటతడి పెట్టించాడు.

రవి(మహర్షి)

అల్లరి నరేష్ చేసిన చెప్పుకోతగ్గ పాత్రల్లో ఇదొకటి. మహర్షి సినిమాలో రవిగా నటించాడు. గ్రామీణ కుర్రాడికి ఉండే కట్టుబాట్లను తన పాత్ర ద్వారా చక్కగా ప్రదర్శించాడు నరేష్.

సూర్యప్రకాశ్(నాంది)

తన సినీ కెరీర్‌లోనే ఈ సినిమా ఒక మలుపు. సీరియస్ పాత్రలో పూర్తి నటుడిగా చేసిన సినిమా ఇది. ఇందులో సూర్యప్రకాశ్ ఓ అండర్‌ ట్రయల్ ఖైదీగా నటించాడు.

శ్రీపాద శ్రీనివాస్(ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం)

స్కూల్ టీచర్‌గా అల్లరి నరేష్ ఈ సినిమాలో నటించాడు. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, తన నటనతో నరేష్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

దీపక్(ఉగ్రం)

ఓ థియేటర్ నిర్వహకుడిగా దీపక్ పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రమిది. టీజర్‌లో అల్లరి నరేష్ కళ్లతో తన ఉగ్రాన్ని చూపించేశాడు.