కోహ్లీ బ్యాట్ ఊపు చూస్తే బంతి దాసోహం కావాల్సిందే. పరుగు తీస్తే పిచ్ అలసి పోవాల్సిందే. ఫీల్డింగు చేస్తే మైదానం కూడా చిన్నబోవాల్సిందే. విరాట్ ఆడితే ప్రత్యర్థికి వణుకు పుట్టాల్సిందే.
టీమిండియాకు దొరికిన ఆణిముత్యం ‘విరాట్ కోహ్లీ’. అందరూ కింగ్ కోహ్లీగా పిలచుకుంటుంటారు. విరాట్ ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్సులను ఆడాడు. ఇతరులతో పోల్చితే తన ఆటశైలి విరాట్‌ను మరోస్థాయిలో నిలబెట్టింది.
షాట్ల ఎంపిక..
తన దూకుడైన ఆట తీరుతో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగల సత్తా ఉన్న ఆటగాడు విరాట్. సంప్రదాయ షాట్లతో పరుగులు రాబట్టగలడు. షాట్ల ఎంపికలో ప్రయోగాలు చేయడు.
లెంగ్త్ బంతులను డీప్ మిడ్ వికెట్ మీదుగా సులువుగా స్టాండ్స్ దాటించగల నేర్పరి విరాట్.
బాధ్యతగా..
ఇన్నింగ్సుని బాధ్యతతో ఆడటం విరాట్ ప్రత్యేకత. కడవరకు నిలబడి భారీ స్కోరు అందించడం లేదా జట్టును గెలిపించడంలో సఫలమయ్యాడు.
ఒత్తిడిలో పరిస్థితులకు అనుగుణంగా తన ఆటతీరును మార్చుకోగలడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వందశాతం ప్రయత్నించగలడు.
ఛేదనలో రారాజు
ఫార్మాట్ ఏదైనా ఛేదనలో విరాట్‌కి సాటి రారు. పరిస్థితులకు అనుగుణంగా రన్‌రేట్‌ని కాపాడుకుంటూ ఇన్నింగ్సుని చక్కదిద్దుతాడు. ఇలా ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. వాటిల్లో గుర్తిండిపోయేవి..
పాక్‌పై
2022 T20 WCలో పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ చరిత్రాత్మకం. 53బంతుల్లో 82 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
ఆసీస్‌పై
2016 T20 WC క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై చేసిన ప్రదర్శన కూడా మరువలేనిది. 52 బంతుల్లోనే 82 పరుగులు చేసి ఇండియాను సెమీస్‌కి తీసుకెళ్లాడు.
2012లో
2012 కామన్‌వెల్త్ బ్యాంక్ సిరీస్ అది. ఇండియా ఫైనల్లోకి వెళ్లాలంటే బోనస్ పాయింట్ అవసరమైంది. లంక నిర్దేశించిన 321 టార్గెట్‌ని 40 ఓవర్ల లోపే ఇండియా ఛేదించాలి.
విరాట్ అద్భుత శతకంతో (86బంతుల్లో 133) చెలరేగి బోనస్ పాయింట్ తెచ్చాడు. లక్ష్యాన్ని 36.4 ఓవర్లలోనే పూర్తిచేశాడు.
జట్టు కోసం..
వ్యక్తిగత ప్రతిభ కన్నా జట్టు ప్రయోజనాలే విరాట్‌కు ముఖ్యం. అర్ధ సెంచరీ, సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో తన రికార్డుల కోసం ఆలోచించడు. జట్టు అవసరాలకు అనుగుణంగా స్ట్రైక్ రొటేట్ చేయడం కోహ్లీ విలక్షణత.
క్రికెట్ సంచలనం
విలక్షణ ఆట తీరుతో తనని తాను మెరుగు పరుచుకుని పరుగుల యంత్రంలా విరాట్ మారాడు. స్థిరత్వం, పట్టుదల, నైపుణ్యం విరాట్‌ను గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దాయి.
సచిన్, రిచర్డ్స్‌లకు సాటి ప్లేయర్‌గా ఎదిగేలా చేశాయి. కానీ, విరాట్ ఈ కీర్తిని అంగీకరించకపోవడం అతడి హుందాతనం. ఇలా క్రికెట్ సంచలనంగా అవతరించాడు.