పంజాబ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి భగవంత్ మాన్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన కట్కర్ కలాన్‌లో పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భగవంత్ మాన్‌తో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘‘ఇంక్విలాబ్ జిందాబాద్’’ అంటూ భగవంత్ మాన్ నినదించారు. ఆయన మాట్లాడుతూ.. మిగతా ముఖ్యమంత్రుల్లా విదేశీ పర్యటనలతో తాను సమయం వృథా చేయనని పంజాబ్‌లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.