ఉక్రెయిన్ నుంచి వచ్చిన ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘హోమ్స్ ఫర్ ఉక్రెయిన్'(Homes for Ukraine) పేరుతో, ఉక్రెయిన్ నుంచి వచ్చిన శరణార్థులకు తమ ఇళ్లలో ఆశ్రయం కల్పించిన వారికి 350 పౌండ్ల నగదు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు వెల్లడించింది. కనీసం ఆరు నెలల పాటు వారికి ఆశ్రయం అందించగలిగితే నెలకు 350 పౌండ్లు చెల్లించనున్నట్లు తెలిపింది. దీంతో వేలాదిమంది ఆశ్రయం పొందుతారని దయచేసి అందరూ దీనికి సహరించాలని కోరింది. అదేవిధంగా స్థానిక సంస్థలకు సహాయక సేవల కోసం ప్రతి శరణార్థికి 10,500 పౌండ్లు అదనపు సహాయం అందించనున్నట్లు తెలిపింది. రష్యా దాడి కారణంగా ఇప్పటివరకు 2.5 మిలియన్లకు పైగా ప్రజలు ఉక్రెయిన్ నుంచి పారిపోయారు, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఎదురైందని బ్రిటన్ పేర్కొంది.