‘అగ్నిపథ్’పై దేశమంతా ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ లో భాగంగా పనిచేసి నాలుగేళ్ల తర్వాత రిలీవ్ అయ్యే ‘అగ్నివీర్’లకు సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వడ్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. గరిష్ఠ వయోపరిమితిని కూడా సడలించింది. ఈ రెండు బలగాల్లో చేరేందుకు మూడేళ్ల సడలింపు ఇస్తామని వెల్లడించింది. దీంతో ఫస్ట్ బ్యాచ్ అగ్నివీర్ లకు మొత్తం ఐదేళ్ల సడలింపు లభించనుంది. ఇప్పటికే ఈయేడాది అగ్నిపథ్ కోసం వయోపరిమితిని రెండేళ్లు సడలించించి 28ఏళ్లకు పెంచింది. కేంద్ర సాయుధ బలగాల్లో ప్రస్తుతం 73,219 పోస్టులున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో మరో 18,124 ఖాళీలున్నాయి.