తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేసి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. సోమవారం టీఆర్ఎస్ శాసనససభపక్ష సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ స్వయంగా ఈ అంశంపై మాట్లాడారు. ఈ సారి ఆరు నూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చాలా పనులు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడంతో గతంలో పాలన కొనసాగించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులు మినహా అన్ని ప్రధాన ప్రాజెక్టులు, కార్యక్రమాలు పూర్తయినందున ఈసారి అలాంటి అవసరం లేదు అని తెలిపారు. తొలి దఫాలో 63 సీట్లు గెలిచి అధికారంలోకి టీఆర్ఎస్, 2018లో 88 సీట్లు గెలిచిందని, ఈ సారి 95-105 సీట్లను గెలిచి అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.