తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య నెల రోజులకు పైగా పరిస్థితులు సజావుగా సాగడం లేదు. రైతు పండించిన ధాన్యం మొత్తం సేకరించడంలో కేంద్రం విఫలమైందని, కనీస మద్దతు ధరపై మోదీని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో రైతు సమస్యలను చర్చిస్తు ధాన్యం సేకరణకు సంబంధించి ప్రధాని మోదీకి బుధవారం లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన ధాన్యం సేకరణ విధానాన్ని అమలు చేయాలన్నారు. కేంద్రం పూర్తిగా పండిన ధాన్యాన్ని సేకరించకుంటే దాని ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడుతుందన్నారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పండే వరి, గోధుమలన్నింటినీ తెలంగాణలోనూ సేకరించాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానిని ఆ లేఖలో కేసీఆర్ కోరారు.