ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మొదలుపెట్టి 20 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి బాలల నిధి యునిసెఫ్ బాధాకరమైన విషయాలను వెల్లడించింది. అక్కడ ప్రతి సెకనుకు ఓ చిన్నారి శరణార్థిగా మారుతున్నట్లు ప్రకటించింది. దీంతో రోజుకు దాదాపు 70 వేల మంది చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. తల్లులకు బిడ్డలు, బిడ్డలకు తల్లిదండ్రులు దూరమవుతున్నారు. ఆ దేశం నుంచి ఇప్పటి వరకు 2.8 మిలియన్ల మంది పౌరులు పొరుగు దేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. యుద్దం కారణంగా 596 మంది ఉక్రెనియన్లు ప్రాణాలు కోల్పోయారని అధికారులు ప్రకటించినప్పటకీ.. ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యునిసెఫ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.