తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం ఓ ఎలక్ట్రిక్ బైక్ రోడ్డుపై మంటల్లో చిక్కుకుంది. వారం వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది కావడం విశేషం. చెన్నైకి చెందిన గణేష్ అనే 21 ఏళ్ల యువకుడు ఆఫీస్ కు వెళుతుండగా తన ఈ-బైక్ నుంచి పొగలు రావడం గమనించాడు. ఆ తర్వాత క్షణాల్లో వాహనంలో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా, దురదృష్టవశాత్తు వాహనం కొన్ని నిమిషాల్లో బూడిదైంది. మరో ఘటనలో వేలూరు జిల్లాలో ఈ-బైక్కు మంటలు అంటుకుని తండ్రీకూతుళ్లు మృతిచెందారు. అంతకుముందు తిరుచ్చిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కాగా, ఈ సంఘటనలు ఈ-బైక్ వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.