ఫ్రెంచ్ ఓపెన్లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్ ఊహాతీత ఉత్కంఠతో హోరాహోరీగా సాగి చివరికి అనూహ్య రీతిలో ముగిసింది. ఫ్రెంచ్ ఓపెన్లో 13 సార్లు చాంపియన్ రఫెల్ నాదల్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ..పాయింట్ పాయింట్కూ యుద్ధంలో సైనికుల్లా పోరాడారు. టెన్నిస్ బంతిని కోర్టులో బుల్లెట్ లా కదలించారు. తొలి సెట్ 7-6తో అతి కష్టమ్మీద నెగ్గిన నాదల్ కు రెండో సెట్లో అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సి వచ్చంది. ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగుతున్న వేళ.. జ్వెరేవ్ జారిపడి గాయం పాలయ్యాడు. కోర్టులో విలవిల్లాడిన జ్వెరేవ్ ఆటనుంచి తప్పుకోవడంతో రఫేల్ నాదల్ 14వసారి ఫైనల్లోకి అడుగుపెట్టాడు.