జీవో 111ని రద్దు చేస్తే ఏడాదిలోపే తాగునీటి వనరులు నిలిచి పోతాయని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) అధికారులు పేర్కొంటున్నారు. జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లోని 1.36 లక్షల ఎకరాల భూములపై గత ప్రభుత్వాలు కన్నేసి ఉంచాయి. 10 కిలోమీటర్ల పరిధిలో పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, సినీ హీరోలు అక్రమంగా భూములు సంపాదించుకున్నారు. ఒకసారి GO 111 రద్దు చేస్తే, ఈ ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెంది జంట సరస్సుల మరణానికి దారి తీస్తుంది. GO రద్దు చేస్తే ఎవరికి ప్రయోజనం చేకూరుతుందో అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు అదొక బహిరంగ రహస్యం అని HMWSSB సీనియర్ అధికారి పేర్కొన్నారు. జీవో 111ను సవరించిన తర్వాత నిర్మాణ కార్యకలాపాలను 5 కి.మీలకే పరిమితం చేసినప్పటికీ, సరస్సులు చివరికి నెమ్మదిగా చనిపోతాయని అధికారి తెలిపారు. హై పవర్ కమిటీ నిర్మాణ బఫర్ ఏరియాను 10 కి.మీ నుంచి 5 కి.మీకి కుదించనుందని ఆయన అన్నారు.