ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నాటకాల ద్వారా మొదలైైన కైకాల నట ప్రస్థానం..నవరస నట సార్వభౌముడిగా ఆయన్ను నిలిపింది. 1955లో సినిమా ప్రయాణం మొదలుపెట్టినా 1960 వరకూ సరైన అవకాశం రాలేదు. విఠలాచార్య ‘కనకదుర్గ పూజా మహిమ’లో సేనాధిపతి పాత్ర సత్యనారాయణ కెరీర్ను నిలబెట్టింది. 1962 నుంచి వరుస అవకాశాలు తలుపుతట్టాయి. శివుడు, ధర్మపాలుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, సుయోధనుడు, భీముడు, రావణాసురుడు ఇలా పౌరాణిక పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. అడవి రాముడు, వేటగాడు వంటి సినిమాల్లో విలన్గా మెప్పించారు. ఎస్వీ రంగారావు తర్వాత పౌరాణిక పాత్రల్లో అంతటి పేరు గడించిన కైకాల తెలుగు చిత్రసీమ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.