ఇటీవల సంచలనం సృష్టించిన జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసు దర్యాప్తులో ఉండగానే మరో కేసు వెలుగులోకి వచ్చింది. మే 31న సుల్తాన్ షాహి ప్రాంతంలో ఉంటున్న మైనర్ బాలిక(12) షాహిన్‌నగర్ వద్ద ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలందుకు కాలినడకన బయలుదేరింది. పహాడిషరీఫ్ వద్ద ఒక క్యాబ్‌ను లిఫ్ట్ అడగ్గా డ్రైవర్ ఇంటివద్ద దింపేస్తానని ఎక్కించుకున్నాడు. తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పగా షాద్‌నగర్ తీసుకెళ్లారు. ఇద్దరు కలిసి బాలికపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె గట్టిగా అరుస్తూ కేకలు వేయడంతో భయపడిన వారు జూన్ 1న ఉదయం 5 గంటలకు మొఘల్‌పుర పోలీస్‌స్టేషన్ వద్ద వదిలేసి వెళ్లారు. పోలీసులు ఆరాతీయగా బాలిక విషయం మొత్తం చెప్పింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.