మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. తండ్రి కొడుకులు మోహన్ బాబు (Mohan Babu), మంచు మనోజ్(Manchu Manoj)లు తమపై దాడి జరిగిందని ఒకరిపై మరొకరు సోమవారం రాత్రి మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వారిద్దరి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన హైదరాబాద్ పహాడిషరీఫ్ పోలీసులు విడివిడిగా రెండు కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్ ఈ వివాదం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆస్తి కోసమో, డబ్బు కోసమో పోరాటం చేయడం లేదని స్పష్టం చేశారు.
గేట్లు తోసుకెళ్లిన మనోజ్..
హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మనోజ్, అతడి భార్య మౌనిక తిరిగి ఇంటికి వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోనికి అనుమతించలేదు. వారి వాహనాన్ని గేటు వద్దే నిలిపివేశారు. దీంతో మనోజ్ దంపతులు కారులోనే చాలా సేపు ఉండాల్సి వచ్చింది. వారి 7 నెలల పాప లోపలే ఉండటంతో కారు నుంచి బయటకు దిగిన మనోజ్ గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ ఏం గొడవ జరుగుతుందా? అని స్థానికంగా ఆందోళన నెలకొంది.
మనోజ్‌కు అల్టిమేటం..
మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. శంషాబాద్ జల్‌పల్లి నివాసం నుంచి మనోజ్‌ను పంపించేయాలని మోహన్ బాబు నిర్ణయించారు. తాజా ఘర్షణ నేపథ్యంలో మనోజ్ ఇక ఇంట్లో ఉండటానికి వీల్లేదని అల్టీమేటం జారిచేసినట్లు తెలుస్తోంది. అటు మనోజ్ సైతం వెళ్లి పోవాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ వాహనాలు తెప్పించి సామాన్లు తరలించేందుకు మనోజ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
గన్‌మెన్‌ల కోసం రిక్వెస్ట్
తన తండ్రి మోహన్‌బాబుతో వివాదం నేపథ్యంలో మంచు మనోజ్, తన భార్య మౌనికతో కలిసి హైదరాబాద్‌లోని ఇంటిలిజెన్స్ కార్యాలయానికి వెళ్లారు. తన భద్రతపై అనుమానాలు ఉన్నాయని సంబంధిత అధికారికి తెలియజేశారు. తమ ఇద్దరికీ గన్‌మెన్లను కేటాయించాలని మనోజ్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు పోలీసు అధికారి అనుమతిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
మంచు విష్ణు వార్నింగ్..
దుబాయి నుంచి వచ్చిన మంచు విష్ణు.. ప్రస్తుతం వివాదానికి కేంద్రమైన జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంట్లోనే ఉన్నారు. మంచు మనోజ్ తరపున వచ్చిన బౌన్సర్లకు విష్ణు వార్నింగ్ ఇస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ బౌన్సర్‌కు వేలు చూపిస్తూ విష్ణు సీరియస్‌గా మాట్లాడటం గమనించవచ్చు.
ఫామ్ హౌస్ చుట్టే లొల్లి..
మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ సంస్థల ఆస్తుల పంపకాల నేపథ్యంలో మంచు ఫ్యామిలీలో వివాదం చెలరేగినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి కారణంగానే తండ్రి కొడుకుల మధ్య గొడవ మెుదలైనట్లు సమాచారం. ఆస్తుల పంపకాలు జరిగినప్పటికీ కూడా తనకు సంబంధంలేని జల్‌పల్లి ఇంట్లో మంచు మనోజ్ ఉండటంతో మోహన్‌బాబు అస్సలు నచ్చలేదని తెలుస్తోంది. తమ కుమారుడు మనోజ్, కోడలు మౌనిక తన ఇంటిని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని హైదరాబాద్ సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘అమ్మ ఒంటరిగా ఉండటంతో’..
ఇంటిని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడన్న మోహన్‌బాబు ఆరోపణలను మంచు మనోజ్ ఖండించారు. ఆ ఇంట్లో ఉంటున్నందుకు గల కారణాన్ని సోమవారం అర్ధరాత్రి పోస్టు చేసిన సుదీర్ఘ పోస్టులో వివరించారు. ‘నా సోదరుడు (మంచు విష్ణు) కొన్ని కారణాల వల్ల దుబాయికి వెళ్లడంతో, ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోంది. మా నాన్న, అతని స్నేహితులు కోరిక మేరకు కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఇంట్లోకి వెళ్లా. ఏడాదిపైగానే అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. అయితే తప్పుడు ఉద్దేశంతోనే నాలుగు నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్లు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలనే నాపై, నా భార్యపై ఆరోపణలు చేశారు. కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నా’ అని అన్నారు.
డబ్బు వృథా చేస్తోంది నేనా? విష్ణునా?
మనోజ్ కారణంగా తన విలువైన వస్తువులు, ఆస్తుల భద్రత విషయంలో భయపడుతున్నట్లు మోహన్‌బాబు సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో మోహన్‌బాబు పేర్కొన్నారు. దీనిపైనా మంచు మనోజ్ తన ఎక్స్‌పోస్టులో స్పందించారు. ‘నా శ్రమ, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల మద్దతుతో ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రగా ఉంటూ కెరీర్‌ను నిర్మించుకున్నా. ఎనిమిదేళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, సోదరుడి చిత్రాలకు పనిచేశా. ఒక్కరూపాయి తీసుకోలేదు. నేనెప్పుడు కుటుంబ ఆస్తులను అడగలేదు. అడిగినట్టు నిరూపించండని సవాల్ చేస్తున్నా. నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాడు. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడు. స్వలాభం కోసం కుటుంబ పేరును వాడుకున్నాడు. నేనెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను. మన కుటుంబంలో డబ్బులు ఎవరు వృథా చేస్తున్నారు.. నేనా? విష్ణునా?’ అంటూ నిలదీశారు.
నన్ను అణిచివేసేందుకే..
వివాదానికి కేంద్రమైన హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు (Mohan Babu) ఇంటి వద్ద నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘నేను చేస్తోంది ఆత్మగౌరవ పోరాటం. తన భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన అంశం. ఒక మగాడిగా నాతో నేరుగా వచ్చి ఇదంతా చేసినా పర్వాలేదు. కానీ, నన్ను అణిచివేసేందుకు నా భార్యను బెదిరించడం, ఏడు నెలల తన పాపను వివాదంలోకి లాగుతున్నారు. నా పిల్లలు ఇంట్లో ఉండగానే నాపై దౌర్జన్యంగా ప్రవర్తించడం సరికాదు’ అని చెప్పారు.
పోలీసుల చర్యలపైనా..
ప్రస్తుతం జల్‌పల్లిలోని ఇంటి వద్ద మంచు విష్ణు (Manchu Vishnu), మనోజ్ తరపున భారీగా బౌన్సర్లు పోగయ్యారు. సోమవారమే మంచు విష్ణు తరపున 40 బౌన్సర్లు రాగా, మనోజ్ మరో 30 మందిని తన భద్రత కోసం పిలిపించారు. తాజాగా ఈ అంశంపై మంచు మనోజ్ మాట్లాడుతూ ‘పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తనకు రక్షణగా తెప్పించుకున్న వ్యక్తులను బెదరగొట్టి పంపించే అధికారం పోలీసులకు ఎక్కడది. ఫిర్యాదు తీసుకున్న తర్వాత కూడా ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?. తనకు మద్దతు కోసం ప్రపంచంలోని అందర్నీ కలుస్తా’ అని మనోజ్ అన్నారు.
బౌన్సర్ల మధ్య ఘర్షణ
మరోవైపు జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద మంచు విష్ణు, మంచు మనోజ్ బౌన్సర్ల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. మనోజ్ తరపు బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు, సెక్యురిటీ సిబ్బంది బలవంతంగా బయటకి పంపించేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో వారు దౌర్జన్యంగా లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుతున్నట్లు సమాచారం. ఒకరినొకరు తోసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
సోమవారం రాత్రి హైడ్రామా
సోమవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు తన అనుచరులతో స్వయంగా వెళ్లిన మనోజ్ తనపై గుర్తు తెలియనివారు దాడి చేశారంటూ తొలుత ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే మోహన్‌బాబు రాచకొండ కమిషనర్‌కు లేఖ రాశారు. తన చిన్న కుమారుడు మంచు మనోజ్, చిన్న కోడలు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని సీపీని కోరారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో మనోజ్, 30 మంది అనుచరులు దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారని, ఇంట్లో ఉన్నవారిని బెదిరించి ఇల్లు ఖాళీ చేయాలంటూ భయపెట్టారని ఆరోపించారు. తన ఆస్తులను కాజేసేందుకు మనోజ్ కుట్ర చేస్తున్నారని సీపీకి తెలియజేశారు.
పవన్ కల్యాణ్‌కు మనోజ్ రిక్వెస్ట్
తండ్రి మోహన్ బాబు రాసిన లేఖను సోమవారం అర్ధరాత్రి మంచు మనోజ్ ఎక్స్‌వేదికగా ఖండించారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సహా ఇరు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలకు ట్యాగ్ చేస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. తనపై తన భార్య మౌనకపై తన తండ్రి మోహన్ బాబు నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. తన పరువు మర్యాదాలను కావాలనే తీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగేలా చేశారని రాసుకొచ్చారు. ఈ మేరకు పది అంశాలతో కూడిన సుదీర్ఘ వివరణ మంచు మనోజ్ ఇచ్చారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’