ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంలో రష్యా దాడిలో మరణించిన భారతీయ వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప తల్లిదండ్రులు తమ కుమారుడి మృతదేహాన్ని వైద్య పరిశోధన కొరకు దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ విద్యార్థి తండ్రి శనివారం తెలిపారు. ‘నా కొడుకు వైద్య రంగంలో ఏదైనా సాధించాలనుకున్నాడు, అది జరగలేదు. కనీసం అతని శరీరాన్ని ఇతర వైద్య విద్యార్థుల రీసెర్చ్ కోసం ఉపయోగించవచ్చు. ఇంట్లో మేము అతని శరీరాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేయాలని నిర్ణయించుకున్నాము. నా కొడుకు మృతదేహం 21వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఉదయం 9 గంటలకు మృతదేహం మా గ్రామానికి చేరుకుంటుంది. అనంతరం వీరశైవ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి ప్రజల సందర్శనార్థం ఉంచుతాం. ఆ తర్వాత పరిశోధన నిమిత్తం మృతదేహాన్ని దావణగెరెలోని ఎస్ఎస్ ఆసుపత్రికి దానం చేస్తా’ అని నవీన్ తండ్రి శంకరప్ప తెలిపారు.