రెండు వారాలుగా ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు గురువారం టర్కీలో ఉన్నత స్థాయి చర్చలు జరిపినప్పటికీ పురోగతిని సాధించలేకపోయాయి. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా రష్యా ప్రతినిధి సెర్గీ లావ్రోవ్తో జరిపిన చర్చల అనంతరం స్పష్టం చేశారు. 24 గంటల కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ప్రసూతి ఆస్పత్రి భవనంపై జరిగిన దాడిలో యువతి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, ఆ సమయంలో ఆస్పత్రిలో రోగులు లేరని రష్యా చెబుతున్న మాటలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. దీనిని అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యన్ “యుద్ధ నేరం”గా అభివర్ణించారు. కాగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్లో దాదాపు 71 మంది పిల్లలు మరణించగా, 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇక, రష్యన్ దళాలు రాజధాని కీవ్ ను ఆక్రమించుకునే క్రమంలో తమ సాయుధ వాహనాలతో చుట్టుముట్టినట్లు తెలుస్తోంది.