పోలీసులు ట్రాఫిక్ చలాన్ కోసం తాము వెళుతున్న కారును ఆపడం వల్లే తమ చిన్నారి చనిపోయాడని ఓ మహిళ పేర్కొంది. పోలీసులు ఆపకుంటే 30 నిమిషాలు ముందుగా ఆస్పత్రికి చేరేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద చోటుచేసుకుంది. జనగాంకు చెందిన మళ్లేశం, సరస్వతి దంపతులకు ఓ కుమారుడు జన్మించగా, ఆమె తన పుట్టిన ఊరు వెంకిర్యాలలో ఉంటుంది. చిన్నారి అనారోగ్యం కారణంగా ఓ కారు కిరాయి తీసుకుని హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో పోలీసులు ఆ కారుకు రూ.వెయ్యి పెండింగ్ చలాన్ ఉందని కారును ఆపారు. అయితే ఆస్పత్రికి వెళుతున్నామని చెప్పినా పోలీసులు వదిలిపెట్టలేదని చిన్నారి తల్లి చెబుతోంది. మరోవైపు బాబు అనారోగ్యం గురించి మాకు చెప్పలేదని, తల్లి ఆరోపణలు నిజం కాదని యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ అంటున్నారు.