‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. ‘ఈ ప్రతిష్ఠాత్మక విజయంతో ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారు. కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాళభైరవ, చంద్రబోస్‌లకు అభినందనలు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకు నా శుభాకాంక్షలు. ఇదొక ప్రత్యేకమైన విజయం’ అని ప్రధాని ట్వీట్ చేశారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా శుభాకాంక్షలు చెప్పారు. ‘భారత్ అంటే ఏంటో చూపించారు’ అని ట్వీట్ చేశారు.