జెర్సీ సినిమాలో హీరో నానికి గుండె సమస్య ఉంటుంది. అయినా ఇండియా జెర్సీ కోసం చనిపోయేదాకా పోరాడుతాడు. కానీ, అది రీల్. ఈ ఆటగాడి కథ రియల్. ఇతడికి గుండె సమస్య ఉంది. ఎక్కువగా పరిగిత్తితే ఆయాసంతో శ్వాస తీసుకోలేడు. డిఫిబ్రిల్లేషన్ చేస్తే తప్ప ఇతడి పరిస్థితి కుదుటపడదు. అయినా, దేశం కోసం ఆడాలన్న తపన ఈ ఆటగాడిని హీరోను చేసింది. నెదర్లాండ్స్ ఫుట్బాల్ జట్టుకు చెందిన డేలీ బ్లైండ్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. అయినా, ఫుట్బాల్ కోసం ఇవేమీ లెక్కచేయకుండా దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మైదానంలోకి దిగినప్పుడు వెంట డిఫిబ్రిల్లేషన్ యంత్రం ఉండాల్సిందే. డచ్ జట్టులో కీలక ఆటగాడు కావడంతో సమస్య ఉందని తెలిసినా అతడిని ఆడించక తప్పని పరిస్థితి. దీంతో బ్లైండ్ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నేడు అర్ధరాత్రి అర్జెంటినాతో నెదర్లాండ్స్ క్వార్టర్ ఫైనల్ ఆడబోతోంది.