సికింద్రాబాద్ అగ్నిపథ్ ఆందోళనల విధ్వంసం వెనక కుట్ర కోణం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. పక్కా ప్రణాళికతోనే బీభత్సం సృష్టించారని పోలీసులు అంటున్నారు. ఆర్మీ కోచింగ్ అకాడమీ నిర్వాహకులు విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారని చెబుతున్నారు. నర్సారావు పేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు అభ్యర్థులను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. సుబ్బారావు అధ్వర్యంలోనే ఆందోళనకారులు రైల్వేస్టేషన్ చేరుకున్నారని వివరిస్తున్నారు. ఆందోళనలకు మూడ్రోజుల క్రితం ఆర్మీ పరీక్ష క్యాన్సిల్ అయిందంటూ సుబ్బారావు అభ్యర్థులను రెచ్చగొట్టారని పోలీసులు తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.