సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్ యువకుడిని నమ్మించి రూ.19 లక్షలు కొల్లగొట్టారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకి చెందిన టెకీకి ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో ఒక్క లైక్ కొడితే రూ.50 కమిషన్ ఇస్తాం అని మెసేజ్ పంపారు. ఇలా ఎన్ని లైకులు కొడితే అన్ని రూ.50 వస్తాయని తెలిపారు. ముందుగా 10 లైకులు కొడితే రూ.500 అతడి అకౌంట్లో వేశారు. ఈ క్రమంలో రూ.1.80 లక్షలు కడితే రూ.3.24 లక్షలు తిరిగిస్తామని మరో మెసేజ్ వచ్చింది. అలాగే రూ.1.80 లక్షలు కట్టగా రూ.3.24 లక్షలు తిరిగి అతడి ఖాతాలో పడ్డాయి. ఈ సారి రూ.19 లక్షలు కడితే రూ.27 లక్షలు ఇస్తామని మెసేజ్ పంపారు. వెంటనే రూ.19 లక్షలు కట్టేశాడు. ఇక తిరిగి ఆ డబ్బు అతడి అకౌంట్‌కు రాలేదు. దీంతో తాను మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.