కేంద్రం తీసుకువచ్చిన మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 166(3) అమానవీయంగా ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనికింద వాహన ప్రమాదాల్లో గాయపడిన, మృతిచెందిన వారి బంధువులు పరిహారం కోసం 6 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ తెచ్చిన సవరణను తప్పుబట్టింది. “ మనదేశంలో ఎవరైనా చనిపోతే కార్యక్రమాలు అన్ని ముగిసి తేరుకోవటానికి వారికి సంవత్సరం పడుతుంది. ఆ తర్వాతే పరిహారం గురించి ఆలోచిస్తారు. దీనిపై కౌంటరు దాఖలు చేయాలి” అని కేంద్రాన్ని ఆదేశించింది.