2022 నవంబరు 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. ఇదొక అద్భుత మైలురాయి అని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది.
48ఏళ్లలో 400కోట్లు..
1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు. కేవలం 48 ఏళ్లలోనే ఈ జనాభా రెట్టింపు కావడం విశేషం. 1804లో ప్రపంచ జనాభా 100 కోట్లకు చేరుకుంది. 170 ఏళ్లలో జనాభా 400 కోట్లకు పెరిగింది.
చైనాదే తొలిస్థానం..
జనాభా పరంగా ప్రస్తుతం చైనా మొదటి స్థానంలో ఉంది. చైనా జనాభా 141 కోట్లు కాగా, 139 కోట్ల జనాభాతో భారత్ రెండో స్థానంలో ఉంది.
5వ స్థానంలో పాకిస్థాన్..
33 కోట్లకు పైగా జనాభాతో అమెరికా మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఇండోనేసియా(27కోట్లు), 23 కోట్లతో పాకిస్థాన్ ఐదో స్థానంలో నిలిచింది.
ఆసియాదే ఆధిపత్యం..
ఖండాల వారీగా ఎప్పట్లాగే ఆసియా తొలి స్థానంలో ఉంది. ఒక అంచనా ప్రకారం ఆసియా జనాభా 464 కోట్ల పైనే. ఆఫ్రికా ఖండం జనాభా 134కోట్లు. 74కోట్లతో ఐరోపా మూడో స్థానంలో ఉంది.
జనాభా లేని అంటార్కిటికా..
ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా జనాభాలో పోటీ పడుతున్నాయి. ఉత్తర అమెరికా జనాభా 59 కోట్లు, దక్షిణ అమెరికా జనాభా 43 కోట్లు. ఆస్ట్రేలియా ఖండ జనాభా 4.3కోట్లు, అంటార్కిటికాలో అధికారికంగా జనాభా గణాంకాలు లేవు.
సమానం దిశగా..
2022 నాటికి ప్రపంచ జనాభాలో పురుషుల జనాభా 50.3శాతం కాగా, మహిళల శాతం 49.7గా ఉంది. 2050 నాటికి ఈ నిష్పత్తి సమానం కావొచ్చు.
వనరుల సృష్టికర్త భారత్..
వచ్చే ఏడాది జనాభాలో చైనాను భారత్ దాటేయనుంది. దీన్నొక అవకాశంగా తీసుకుని ‘వనరుల సృష్టికర్త’గా ఎదగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
నెం.3గా నైజీరియా
2050 నాటికి జనాభా పరంగా నైజీరియా గణనీయ వృద్ధిని సాధించనుంది. అమెరికా, పాకిస్థాన్‌లను దాటేసి మూడో స్థానానికి ఎగబాకనుంది. కాగా, మొదటి స్థానంలో ఉండే దేశం ఇండియానే. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉండనుంది.
యవ్వన దేశం.
భారత్‌లో సగటు వయసు 28.7 ఏళ్లు. అంతర్జాతీయ సగటు వయసు(30.3)తో పోలిస్తే మన దేశంలోనే యువత ఎక్కువగా ఉన్నారు. చైనా(38.4), జపాన్(48.6) వెనకబడి ఉన్నాయి.
యువ భారత్..
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లోనే యువకుల జనాభా ఎక్కువ. 27శాతం 15-29 ఏళ్ల మధ్య వయసున్న వారేనని ఐక్యరాజ్య సమితి విభాగమైన జనాభా నిధి అంచనా వేసింది.
సంతానోత్పత్తి రేటు..
భారత్‌లో సంతాన సాఫల్య రేటు తగ్గుతోంది. ఒక మహిళకు పుట్టే పిల్లల సగటు 2కి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా ఇది 2.3కి పరిమితమైంది. 1950లో ఈ రేటు 5గా ఉంది. 2050లో 2.1కి పడిపోతుందని అంచనా.
పెరుగుతున్న ఆయుర్ధాయం
మనిషి ఆయుర్దాయం పెరుగుతుండటం గమనార్హం. 1950లో 46.5ఏళ్లు సగటు ఆయుర్దాయమైతే, 2019 నాటికి 72.8ఏళ్లకు పెరిగింది. ప్రస్తుతం 77.2 ఏళ్లకు చేరుకుంది.
2037లో 900 కోట్లకు..
ప్రస్తుతం జనాభా వృద్ధి రేటు 1శాతం కన్నా తక్కువే. 900 కోట్ల జనాభాకు చేరుకోవాలంటే మరో 15ఏళ్లు పట్టే అవకాశం ఉంది.