రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించి సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.
9 వికెట్లను చేతిలో ఉంచుకుని మూడో రోజు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు జడేజా, అశ్విన్‌ల స్పిన్ ద్వయం చుక్కలు చూపించింది.
ఆట మొదలైన కొద్దిసేపటికి ఆసీస్ వికెట్ల పతనం ప్రారంభమైంది. దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్‌ని 65 పరుగుల స్కోరు వద్ద అశ్విన్ బోల్తా కొట్టించాడు. స్టీవెన్ స్మిత్‌ని అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
95 స్కోరు వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు చేయకుండానే ఆసీస్ మరో 3 వికెట్లు కోల్పోయింది.
అశ్విన్, జడేజా కలిసి 11 బంతుల్లో 4 వికెట్లు తీశారు. ఒక్క పరుగు కూడా ఇవ్వకపోవడం విశేషం. దీంతో 95/7గా నిలిచింది.
టెస్టుల్లో రవీంద్ర జడేజా(7/42) కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
వరుస వికెట్ల పతనంతో కష్టాల్లో పడ్డ ఆస్ట్రేలియా మరో 18 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 113 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌ని ముగించింది.
కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. కేవలం 1 పరుగే చేసి వెనుదిరిగాడు. మరోవైపు రోహిత్ దూకుడుగా ఆడాడు.
స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్న రోహిత్(30) అదనపు పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. అప్పటికి స్కోరు 39/2.
పుజారా వికెట్ కాపాడుతూ ఉండగా, విరాట్ కాస్త వేగంగా ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో 20 పరుగులు చేసి కెరీర్‌లో తొలిసారిగా స్టంపౌట్ అయ్యాడు.
రెండో టెస్టుతో విరాట్ కెరీర్‌లో 25,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 549 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. సచిన్(577), పాంటింగ్(588), కల్లిస్(594)తో ఉన్నారు.
పుజారా(31*), శ్రీకర్ భరత్(23*) చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌కు విజయాన్ని అందించారు. శ్రేయస్ అయ్యర్(12) విఫలమయ్యాడు.
స్కోర్లు: ఆస్ట్రేలియా 263, 113; భారత్ 262, 118/4.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: రవీంద్ర జడేజా