BGT: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం DAY3 highlights and Records

YouSay Short News App

బోర్డర్‌ గవాస్కర్‌ టోఫీ2023లో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇన్నింగ్స్‌ తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 177 పరుగులకు ఆలౌట్‌ కాగా…టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో  400 పరుగులు చేసింది.

మూడో రోజు 321-7 వికెట్ల వద్ద ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా ఆట మొదలైన కాసేపటికే రవీంద్ర జడేజా(70) ని కోల్పోయింది.  ఆ తర్వాత మహ్మద్ షమీ 37(47) ఒక సూపర్‌ ఫాస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

కంగారూలు వరుసగా వికెట్లు తీసి టీమిండియాను 400 పరుగులకు కట్టడి చేశారు. ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ 84 పరుగులతో జట్టులో రెండో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

ఇండియా 223 పరుగుల లీడ్‌లో ఉండగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా భారత స్పిన్నర్ల ధాటికి తట్టుకోలేక పోయింది.

7 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత 6వ ఓవర్‌లో వార్నర్‌ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్‌ కోహ్లీ నేలవిడిచాడు. అయినా ఆ తర్వాత కాసేపటికే 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్‌ వెనుదిరిగాడు.

అశ్విన్‌, జడేజా చెరోవైపు నుంచి వరుస వికెట్లు తీస్తూ ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. మొత్తంగా అశ్విన్‌ 5 వికెట్లు, జడేజా 2 వికెట్లు అక్షర్ పటేల్‌ 1, షమీ 2 వికెట్లు తీసుకున్నారు.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్మిత్  ఒక్కడే చివరిదాకా నిలబడ్డాడు. మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్మిత్‌  51 బంతుల్లో 25   పరుగులు చేశాడు.

మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 91 పరుగులకే చాప చుట్టేసింది. భారత్‌  ఇన్నింగ్స్‌ 132   పరుగుల తేడాతో గెలిచింది.

ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. అనిల్‌ కుంబ్లే 111 తర్వాత స్థానానికి అశ్విన్‌ చేరాడు.

ఆస్ట్రేలియా తరఫున ఆరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా టాడ్ మర్ఫీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన మర్ఫీ..బాబ్‌ మస్సీ(8), జేసన్‌ క్రేజా(8)ల వెనక ఉన్నాడు.

భారత బ్యాటర్లలో రోహిత్‌ 120, అక్షర్ పటేల్‌ 84, రవీంద్ర జడేజా 70 అదరగొట్టారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 177 పరుగులకు సమానంగా జడేజా, అశ్విన్, అక్షర్  స్పిన్‌ త్రయం పరుగులు చేశారు.

టెస్టుల్లో సిక్సర్లలో మహ్మద్‌ షమీ, విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. విరాట్‌ 174 ఇన్నింగ్స్‌లో 24 సిక్స్‌లు కొడితే షమీ 85 ఇన్నింగ్స్‌లో 25 సిక్స్‌లు కొట్టాడు.భారత గడ్డపై ఆస్ట్రేలియాకు ఇదే (91) అత్యల్ప స్కోరు.