CCL: తెలుగు వారియర్స్ ట్రోఫీ నిలబెట్టుకుంటుందా? ప్లేయర్స్ వీరే

YouSay Short News App

సినిమా హీరోల క్రికెట్ పండుగ మళ్ళీ వచ్చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ‘తెలుగు వారియర్స్’ ట్రోఫీని నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగింది.

అఖిల్ కెప్టెన్సీలో ఆదివారం ‘తెలుగు వారియర్స్’ టీం కేరళ బ్లాస్టర్స్‌పై 64 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయాన్ని అఖిల్ ‘తారకరత్న’కు అంకితం ఇచ్చారు.

తారకరత్న సజీవంగా ఉండి ఉంటే తెలుగు వారియర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించేవాడే. జట్టులో ఆల్‌రౌండర్‌గా తారకరత్న కీలక పాత్ర పోషించేవాడు. ఈ క్రమంలో మన జట్టు బృంద సభ్యులెవరో తెలుసుకుందాం.

అక్కినేని అఖిల్ తెలుగు వారియర్స్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఆల్‌రౌండర్ అయిన అఖిల్ మన జట్టుకు వెన్నెముక లాంటివాడు. ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు.

నిఖిల్ కూడా ఆల్‌రౌండరే. మైదానంలో చురుకుగా కదులుతుంటాడు. కీలక సమయాల్లో జట్టులో రాణించగలడు. ‘18 పేజెస్’ సినిమాతో నిఖిల్ రీసెంట్‌గా హిట్ అందుకున్నాడు.

హీరో, విలన్ పాత్రలు పోషించే ‘ప్రిన్స్’ తెలుగు వారియర్స్‌లో కీలక ఆటగాడు. జట్టుకు ఓపెనింగ్ చేస్తాడు. బౌలింగ్‌లోనూ రాణించగలడు. ‘డీజే టిల్లు’లో ప్రిన్స్ అలరించాడు.

ఆదర్శ్ మంచి ఆల్‌రౌండర్. తెలుగు వారియర్స్ జట్టుకు ఎప్పటినుంచో ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ‘కలర్ ఫోటో’ సినిమాలో నటించాడు.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పిన్ ఆల్‌రౌండర్. బౌలింగ్‌లో కీలకం. డ్రమ్స్‌తోనే కాదు.. స్పిన్‌తోనూ మ్యాజిక్ చేసేస్తాడు. అలవోకగా సిక్స్‌లు బాదగలడు.

అశ్విన్ బాబు ఆల్‌రౌండర్. జట్టులో ఫినిషర్‌ పాత్ర పోషిస్తాడు. సులువుగా సిక్స్‌లు కొట్టగల నైపుణ్యం ఉంది. బౌలింగ్‌లో ఫర్వాలేదు. ‘రాజు గారి గది’ సినిమాలో అశ్విన్ నటించిన సంగతి తెలిసిందే.

సాయిధరమ్ తేజ్ జట్టులో ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తాడు. తేజ్ నుంచి భారీ ఇన్నింగ్స్‌ని ఆశించొచ్చు. ‘విరూపాక్ష’ సినిమాతో సుప్రీం హీరో బిజీగా ఉన్నాడు.

నందకిషోర్ బౌలర్. బౌలింగ్ దళాన్ని నడిపించేది నందకిషోరే. అవసరమైనప్పుడు కీలక వికెట్లు తీయగలడు.

అయ్యప్ప శర్మ జట్టుకు వికెట్ కీపర్. బ్యాటింగ్ సమర్థంగా చేయగలడు.

రఘు ఆల్‌రౌండర్. జట్టుకు సమతూకం తీసుకొస్తాడు. స్థిరత్వం కలిగిన ప్లేయర్.

సామ్రాట్ బౌలర్. పదునైన బంతులతో ప్రత్యర్థిని ఇరుకున పెట్టగలడు. పొడగరి కావడంతో సులవుగా బౌన్స్ వేయగలడు.

తరుణ్ కూడా ఆల్‌రౌండరే. బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించగలడు. గతంలో కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.

విశ్వ ఆల్‌రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఫర్వాలేదనిపిస్తాడు. చురుగ్గా ఫీల్డింగ్‌ చేస్తుంటాడు.

తెలుగు వారియర్స్ జట్టులో ఉన్న మరో ఆల్‌రౌండర్ సుశాంత్. ప్రస్తుతం ‘రావణాసుర’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూం ఆల్‌రౌండరే. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు.

కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హరిష్.. మంచి క్రికెటర్ కూడా. జట్టులో ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తాడు.

ఫ్రాంఛైజీ ఓనర్ సచిన్ జోషి. ఇతడు జట్టులో సభ్యుడు కూడా. బ్యాటింగ్‌లో ఇరగదీస్తాడు. బౌలింగ్‌లోనూ రాణించగలడు.

విక్టరీ వెంకటేష్ జట్టుకు మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. యాక్టివ్‌గా ఉంటూ ఆటగాళ్లలో ఉత్సాహం నింపగలడు ఈ మాజీ ప్లేయర్.

ఇంతమంది హీరోలు ఉన్నచోట హీరోయిన్లు లేకపోతే ఎలా. బ్రాండ్ అంబాసిడర్లు ఈ లోటును తీరుస్తున్నారు. రెజీనా కసాండ్రా, ఆదా శర్మ, ప్రణతి సుభాష్ జట్టును ప్రమోట్ చేస్తున్నారు.

బెంగాల్ టైగర్స్‌తో ఫిబ్రవరి 25న, పంజాబ్ దె షేర్‌తో మార్చి 4న, చెన్నై రైనోస్‌తో  మార్చి 12న తెలుగు వారియర్స్ పోటీ పడనుంది.

టాప్ 4 జట్లు సెమీఫైనల్‌కి అర్హత సాధిస్తాయి. మార్చి 18న సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. 19న ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. హైదరాబాద్ వేదిక.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.