సూపర్ స్టార్ కృష్ణకి

ప్రముఖుల నివాళులు!

Floral Separator

సూపర్ స్టార్ కృష్ణ తన 79వ ఏట తుదిశ్వాస విడిచారు. జీవితమనే రంగస్థలంలో తన పాత్ర ముగించుకుని కోట్ల హృదయాలను గెలుచుకున్నారు.

తెలుగు చిత్రపరిశ్రమ పురోగతికి ఎంతో కృషి చేసిన కృష్ణకి ప్రముఖులు నీరాజనం పలికారు. అడుగడుగునా ఆయన సేవలని కొనియాడారు.

నరేంద్రమోదీ..

లెజెండరీ నటుడు. తన విలక్షణ నటనతో ఎన్నో హృదయాలను సొంతం చేసుకున్నారు. ఆయన మరణం వినోద రంగానికే తీరని లోటు. మహేశ్ బాబుకు నా ప్రగాఢ సానుభూతి.

వెంకయ్యనాయుడు..

తెలుగు తెరపై సూపర్ స్టార్ కృష్ణ చాటిన స్ఫూర్తి అజరామరం. ఆయన నటించిన పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

రాహుల్ గాంధీ..

ఘట్టమనేని కృష్ణజీ మరణం నన్నెంతో బాధించింది. నిబద్ధత, విలువలు గల నటుడు. ప్రజలకు ఆదర్శం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

గవర్నర్ తమిళిసై..

తెలుగు లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి హఠాన్మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా.

ఏపీ గవర్నర్..

కృష్ణ గారు లేకపోవడం తెలుగు సినిమా రంగానికి తీరని లోటు. ఆయన సేవలు అజరామరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

కేసీఆర్..

నాటి కార్మిక, కర్షక లోకం కృష్ణ గారిని అభిమాన తారగా చూసేది. కుటుంబ కథా చిత్రాలతో పాటు సామాజిక స్పృహ కలిగించే సినిమాలు ఎన్నో చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

జగన్..

ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా కీర్తి గడించిన నటుడు. ఆయన మరణం తెలుగు సినిమాకు, తెలుగు ప్రజలకు తీరని లోటు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా.

రజనీకాంత్..

కృష్ణ మరణం తీరని లోటు. ఆయనతో నటించిన 3 సినిమాలు నాకు మధుర జ్ఞాపకాలు. మహేశ్ బాబు, ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నా. కృష్ణ ఆత్మకు శాంతి కలగాలి.

రాఘవేంద్రరావు..

కృష్ణ మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. మంచి మనసుకు మారుపేరు కృష్ణ. దేవుడు చేసిన మనిషిని దేవుడే తన దగ్గరికి తీసుకెళ్లాడు.

చిరంజీవి..

మాటలకు అందని విషాదమిది. మంచి మనసుకు ప్రతిరూపం కృష్ణ గారు. భారత సినీ పరిశ్రమలోనే ఆయన అరుదైన వ్యక్తి. సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన ధీశాలికి అశ్రునివాలి.

బాలకృష్ణ..

కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. నాన్న గారు, ఆయన కలిసి ఎన్నో సినిమాలు చేశారు. తెలుగు సినిమాకు నూతన ఒరవడిని తీసుకొచ్చిన గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాత. పుట్టెడు దు:ఖంలో ఉన్న సోదరుడు మహేశ్‌కి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా.

నాగార్జున..

ప్రతి జానర్‌లో సినిమా చేసిన ధైర్యశాలి. ఆయన సానుకూల ధోరణిని ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని. తెలుగు చిత్రాల్లో ఆయన అసలైన కౌబాయ్. నిజమైన సూపర్ స్టార్. మిమ్మల్ని మిస్సవుతున్నాం కృష్ణ గారూ.

వెంకటేశ్..

ఆయనో శిఖరం. స్క్రీన్ ముందు ఆయన ఠీవీగా నిలబడే తీరుకు సాటి లేదు. మహేశ్ బాబు, కుటుంబ సభ్యులకు ఈ విషాదం నుంచి బయటిపడే కాంతిరేఖను ఆ దేవుడు ప్రసాదించాలి.

పవన్ కళ్యాణ్..

సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన నటుడు కృష్ణగారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుమారుడు మహేశ్ బాబుకి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

జూ.ఎన్టీఆర్..

కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు  పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికీ చిరస్మరణీయం. మహేశ్ అన్నకి స్థైర్యం కలిగించాలని కోరుకుంటున్నా.

అల్లు అర్జున్..

ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిత్రపరిశ్రమకు కృష్ణ గారు చేసిన సేవల్ని మాటల్లో వర్ణించలేం. అన్ని రకాలుగా ఆయన అసలైన సూపర్ స్టార్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.

రాజమౌళి..

భయపడకుండా ఎలా ముందుకు సాగాలో ఆయణ్ను చూసి నేర్చుకోవాలి. సినిమాపై ప్రేమ, అభిరుచి ఉండటం వల్లే ఆయన కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. అంతే సమర్థంగా వినియోగించారు. సినీ చరిత్రలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి కృష్ణ గారు.

సమంత..

మీరెప్పటికీ మా జ్ఞాపకాల్లోనే ఉంటారు కృష్ణ గారూ. ఆయన కుటుంబానికి, మహేశ్ గారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.

మురళీమోహన్..

సినిమాను జడ్జ్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇద్దరం కలిసి ఏలూరులో చదువుకున్నాం. ఆయన అనుకున్నవన్నీ సాధించారు.

ఘట్టమనేని కుటుంబం..

వెండితెరపైనే కాకుండా ప్రేమ, ఆప్యాయతలను పంచడంలో ఆయనెప్పుడూ సూపర్ స్టారే. అన్నిటికంటే మమ్మల్ని ఎంతగానో ప్రేమించారాయన. ఇక ప్రతిరోజు గుండె భారంతోనే గడపాల్సి ఉంటుందేమో.

ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కృష్ణకి అశ్రునివాళులర్పించారు. కృష్ణతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు.