ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు

YouSay Short News App

కంపెనీలు ఎందుకు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి?

ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి?

ఆర్థిక మాంద్యం కారణాలు?

ఆర్థిక మాంద్యాన్ని అరికట్టే చర్యలు?

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య భయాలు వెంటాడుతున్నాయి.ఖర్చులు తగ్గించుకునుందేకు కంపెనీలు ఉద్యోగులను పెద్దసంఖ్యలో తొలగిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి

ఫేస్‌బుక్‌తో ప్రారంభం..

మెటా( ఫేస్‌బుక్) అధినేత మార్క్‌ జూకర్ బర్గ్ తన కంపెనీలో పనిచేస్తున్న 11వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడంతో ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు 6 వారాల వేతనంతో పాటు 6నెలల ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

ట్విట్టర్‌లో సగం ఖాళీ

ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ సైతం తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగించారు.

దాదాపు 4 వేల మందికి ఉద్వాసన పలికారు. 12గంటల పాటు పనిచేయాలని నిబంధన విధించారు.

ఈ నిబంధన పట్ల ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున ట్విట్టర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. #రిప్ ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాను హోరెత్తించారు.

ఉద్యోగుల ఆందోళనతో ఈనెల 21 వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆఫీసులను షట్ డౌన్ చేసింది. ఈనెల 21 వరకు ఆఫీసులకు రావొద్దని ఈమెయిల్స్ పెట్టింది.

అమెజాన్ కూడా..

అమెజాన్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టింది. సుమారు 10వేల మంది ఎంప్లాయిస్‍ను తొలగించనున్నట్టు అధికారికంగా ధ్రువీకరించింది. సిబ్బంది తొలగింపు వచ్చే ఏడాది వరకు కొనసాగుతోందని సీఈఓ ఆండీ జస్సీ పేర్కొన్నారు.

ఇంత పెద్ద కంపెనీలు అసలు ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నాయి? అసలు ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి? వాటి వల్ల జరిగి నష్టాలు ఏంటో సూటిగా సుత్తి లేకుండా తెలుసుకుందాం.

ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి?

ఆర్థిక మాంద్యం అంటే ఒక దేశం ఆర్థిక వృద్ధిరేటు రోజురోజుకు కుచించుకుపోవడాన్ని ఆర్థిక మాంద్యంగా చెప్పవచ్చు.  ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండు(2*3= 6 నెలలు) త్రైమాసికాలు వృద్ధిరేటు తగ్గిపోవడాన్ని ఆర్థిక మాంద్యం అంటారు.

సామాన్య పరిభాషలో చెప్పాలంటే ప్రజలు ఏ వస్తువు కొనుగోలు చేయకుండా జాగ్రత్త వహించే పరిస్థితిని మాంద్యంగా చెప్పవచ్చు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక మాంద్యం ఎలా వస్తుంది?

ఆర్థిక మాంద్యం ఎలా వస్తుందనేదానికి సరైన కారణాలు లేవు.  కానీ దాని ఉనిఖిని మాత్రం గమనించవచ్చు. ఉదాహరణకు అమెరికాను తీసుకుందాం.

ప్రస్తుతం అమెరికా ఆర్థిక మాంద్యంలో ఉంది. కోవిడ్ అనంతరం  అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. అంటే  వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రజలు ఖర్చు పెట్టే డబ్బు అధికంగా ఉండి... వస్తు ఉత్పత్తి తక్కువగా ఉండటం.

ఇలా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి  అమెరికా కేంద్రబ్యాంకు వడ్డీ రేట్లను ఇటీవల భారీగా పెంచింది.

అమెరికాలాంటి నిర్మాణాత్మక ఆర్థికవ్యవస్థలో ఎక్కువమంది ప్రజలు బ్యాంకు లావదేవీలపై ఆధారపడుతుంటారు.

ఇలా వడ్డీ రేట్లను ఒక్కసారిగా పెంచడం వల్ల ప్రజలు నెలవారిగా బ్యాంకులకు చెల్లించే EMI మొత్తం పెరుగుతుంది.

ఫలితంగా  ప్రజల వద్ద అందుబాటులో ఉండే డబ్బు తగ్గుతుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఎవరైనా ఆలోచిస్తారు. పొదుపుపై దృష్టి సారిస్తారు. ఈ పరిణామామే మాంద్యానికి తొలి మెట్టు

వడ్డీ రేట్లను పెంచడం వల్ల ఆర్థిక మాంద్యం వస్తుందా?

కేంద్రబ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం వల్ల ఆర్థిక మాంద్యం వస్తుందా అంటే... రాదు అని కచ్చితంగా చెప్పలేం.

కానీ భారీగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల డబ్బు ఖర్చు పెట్టడంపై వ్యక్తులు జాగ్రత్త వహిస్తారు. ఇది పొదుపు చేస్తే పర్వాలేదు కానీ అతి జాగ్రత్త వహిస్తే  ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది.

ఎలాగంటే  ఐటీ కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి వడ్డీరేట్లు పెంచకముందు బాగా ఖర్చు చేసేవాడు అనుకుందాం. వడ్డీ రేట్లు పెంచగానే నెలవారి EMI పెరగడంతో ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటాడు. దీంతో ఖర్చును తగ్గిస్తాడు. ఈ ప్రభావం ఇతర రంగాలపై కూడా పడుతుంది.

ఎలా అంటే బాగా సంపాదించే సాప్ట్‌వేర్ ఉద్యోగులే ఖర్చును తగ్గిస్తే.. మనం కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి కదా అనే మానసిక ఆందోళన ఇతర ఉద్యోగుల్లోనూ ఉదయిస్తుంది.

దీంతో వారు కూడా తమ ఖర్చులను తగ్గిస్తారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గి డిమాండ్ పడిపోతుంది.

వస్తువుల డిమాండ్ పడిపోవడం వల్ల పరిశ్రమలు తమ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఉత్పత్తి తగ్గితే... కంపెనీల్లో  పని తగ్గుతుంది. ఫలితంగా ఉద్యోగుల అవసరం తగ్గుతుంది.

అంతిమంగా యాజమాన్యాలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

ఈ పరిణామం కొన్ని నెలల పాటు అలాగే కొనసాగితే... మొత్తంగా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది.

ఎందుకంటే వస్తువులు- సేవల కొనుగోలు వల్లనే కదా ఆర్థిక వ్యవస్థ ముందుకు నడిచేది. ప్రజల కొనుగోళ్లు చేయడం వల్లనే కదా పన్నుల రూపంలో ప్రభుత్వాలకు రాబడి వచ్చేది.

1.ఆర్థిక మాంద్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ముందు    ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు చేపట్టాలి. 2.ఉపాధిని పెంచే రంగాలపై ప్రభుత్వాలు పెట్టుబడులుగా    పెట్టాలి. 3.భారత్ లాంటి దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ    పథకం ద్వారా కొంత మేర నిరుద్యోగితను తగ్గించవచ్చు. 4.వడ్డీ రేట్లను ఒకేసారి పెంచకుండా... ఆర్థికవ్యవస్థ      గమనానికి అనుగుణంగా పెంచాలి

ఆర్థిక మాంద్యాన్ని అరికట్టే చర్యలు?

5.క్రమంగా వడ్డీ రేట్లను తగ్గించాలి. ఫలితంగా బ్యాంకులకు   కట్టే EMI డబ్బు తగ్గి చేతుల్లో డబ్బులు మిగులుతాయి. 6.ప్రభుత్వాలు ఆర్థిక ఉద్దీపన చర్యలు చేపట్టాలి. 7.బ్యాంకులకు ఆర్థిక ప్యాకేజీలు అందించి రుణాలు తక్కువ   వడ్డీకి ఇచ్చేలా చూడాలి 8.ఎక్కువ మందికి ఉపాది కల్పించే చిన్న పరిశ్రమలకు     ఉదారంగా రుణాలు ఇవ్వాలి.

అప్పుడు పరిశ్రమలు రుణాలను పెట్టుబడిగా మార్చుకుని ఉత్పత్తి పెంచడానికి  చర్యలు చేపడుతాయి. ఉత్పత్తిని పెంచేందుకు అదనపు ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది. దీంతో ఎంప్లాయిమెంట్ జనరేట్ అవుతుంది.

ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు తీసుకునే తక్షణ చర్యలకు బదులు... ఆర్థిక వృద్ధికి అనుగుణంగా తీసుకునే దీర్ఘకాల నిర్ధిష్ట చర్యలు ప్రతి ఆర్థిక వ్యవస్థకు మంచిది.