మూడో టైటిల్ కోసం అర్జెంటినా, ఫ్రాన్స్ పోరాటం..!

FIFA WORLD CUP 2022

YouSay Short News App

ఫిఫా ప్రపంచకప్ అంతిమ సమరానికి వేళైంది. చివరి పోరులో అర్జెంటినాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ పోటీ పడబోతోంది. ఇరు జట్లు రెండు సార్లు టైటిల్‌ని ముద్దాడాయి. మూడో ట్రోఫీ కోసం ఈ నెల 18న పోటీ పడబోతున్నాయి.

4వ సారీ అమీతుమీ..

ప్రపంచకప్‌లలో అర్జెంటినా, ఫ్రాన్స్ తలపడటం ఇది నాలుగో సారి. ఇదివరకు 3 సార్లు తలపడ్డాయి. 1930,1978లో గ్రూప్ దశలో; 2018లో నాకౌట్ దశలో ఈ జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి.

1930,1978లో ఫ్రాన్స్‌పై అర్జెంటినా పైచేయి సాధించింది. 2018లో జరిగిన ప్రిక్వార్టర్స్(రౌండ్ ఆఫ్ 16) మ్యాచులో మాత్రం అర్జెంటినాపై ఫ్రాన్స్ 4-3 తేడాతో గెలుపొందింది.

ఫైనల్‌కు వచ్చారిలా..!

గ్రూప్ దశలో తొలి మూడు మ్యాచుల్లో..

టాప్‌లో ఇరు జట్లు..

రెండు జట్లూ రెండు మ్యాచుల్లో గెలిచి.. ఒక మ్యాచులో ఓడాయి. అదేవిధంగా ఆరేసి పాయింట్లతో గ్రూప్ దశను అగ్ర స్థానంతో ముగించాయి. గ్రూప్ సి నుంచి అర్జెంటినా ఫైనల్‌కి చేరుకోగా, ‘గ్రూప్ డి’కి ఫ్రాన్స్ ప్రాతినిథ్యం వహించింది.

ప్రి క్వార్టర్స్(రౌండ్ ఆఫ్ 16)..

ప్రి క్వార్టర్స్‌లో అర్జెంటినా.. ఆస్ట్రేలియాతో తలపడింది. 2-1 గోల్స్ తేడాతో గెలిచి క్వార్టర్స్‌కి చేరుకుంది. 3-1 గోల్స్ తేడాతో పోలండ్‌‌ని మట్టికరిపించి ప్రిక్వార్టర్స్‌ని ఫ్రాన్స్ ఘనంగా ముగించింది.

క్వార్టర్ ఫైనల్స్..

2014 ప్రపంచకప్‌ సెమీఫైనల్ పోరు‌ని గుర్తుకు తెస్తూ అర్జెంటినా నెదర్లాండ్స్‌పై పెనాల్టీ షూటౌట్లో పై చేయి సాధించింది. చెరో రెండు గోల్స్ చేయగా.. పెనాల్టీ షూటౌట్ రౌండులో 4-3 తేడాతో అర్జెంటినా విజయం సాధించింది.

టోర్నీలో గట్టిపోటీదారైన ఇంగ్లండుని ఫ్రాన్స్ ధీటుగా ఎదుర్కొంది. 2-1 తేడాతో మూడు సింహాల జట్టును ఇంటికి పంపించి.. సెమీఫైనల్‌కి చేరుకుంది.

సెమీ ఫైనల్స్..

2014లో రన్నరప్ అయిన అర్జెంటినా.. 2018 రన్నరప్‌ క్రొయేషియాతో సెమీఫైనల్‌లో తలపడింది. ఉత్కంఠగా సాగిన మ్యాచులో 3-0 తో గెలిచి ఫైనల్‌కి అడుగు పెట్టింది.

అగ్రశ్రేణి జట్లకు షాకిస్తూ సెమీఫైనల్‌కి చేరుకున్న మొరాకో జట్టు దూకుడును ఫ్రెంచి జట్టు నిలువరించింది. పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ ఆఫ్రికన్ జట్టుపై 2-0 తేడాతో గెలిచి వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది.

ఎన్నో సారి..?

అర్జెంటినాకు ఫైనల్ ఆడటం ఇది ఆరోసారి. రెండు సార్లు(1978, 1986)లో కప్పును ముద్దాడింది. 1930, 1990, 2014లో రన్నరప్‌గా నిలిచింది.

నాలుగో సారి ఫ్రాన్స్‌ ఫైనల్‌ ఆడబోతోంది. 1998, 2018లో కప్పు గెలుచుకోగా.. 2006లో జర్మనీకి ట్రోఫీని అప్పగించింది.

మెస్సీ vs ఎంబాపే..

ఈ ప్రపంచకప్‌లో ఐదేసి గోల్స్‌తో మెస్సీ, ఎంబాపే టాప్ గోల్ స్కోరర్లుగా ఉన్నారు. గోల్డెన్ బూట్ కోసం వీరిద్దరూ పోటీ పడుతున్నారు. వీరిద్దరి జెర్సీ నెంబర్ 10 కావడం యాదృచ్చికం.

మెస్సీ చివరి మ్యాచ్..

లియోనల్ మెస్సీకి ఇది చివరి ప్రపంచకప్. ఈ ఫైనల్ మ్యాచుతో ప్రపంచకప్‌కు ఘనంగా వీడ్కోలు పలుకుతానని మెస్సీ ప్రకటించాడు.

లెజండరీ ప్లేయర్..

ప్రపంచకప్ టోర్నీల్లో అర్జెంటినా తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు మెస్సీనే. 11 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. అర్జెంటినా తరఫున అత్యధిక మ్యాచులు(25) ఆడిన ఆటగాడిగానూ ఘనత సాధించాడు.

పీలే రికార్డుకు చేరువలో..

ఫైనల్ మ్యాచులో మెస్సీ ఒక గోల్ చేస్తే.. ఫుట్‌బాల్ దిగ్గజం పీలే(12) రికార్డును సమం చేస్తాడు. బటిస్టుటా(10), మరడోనా(8)లను దాటేశాడు.

కీలక ఆటగాళ్లు..

అర్జెంటినా: మెస్సీ, అల్వరెజ్, ఫెర్నాండెజ్,  డి మరియా, మార్టినెజ్.

కీలక ఆటగాళ్లు..

ఫ్రాన్స్: ఎంబాపే, గ్రీజ్‌మన్, జిరౌడ్,  హెర్నాండెజ్, హుగో లోరిస్.

లుసెయిల్ వేదికగా..

ఈ నెల 18న రాత్రి 8.30గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రతిష్ఠాత్మక లుసెయిల్ స్టేడియం వేదిక కానుంది. 80,000 మంది వీక్షకులు చూడగల సామర్థ్యం ఈ స్టేడియం సొంతం.