భాగస్వామితో గొడవపడ్డారా?  ఇవి గుర్తుంచుకోండి!

YouSay Short News App

ప్రేమ, స్నేహం, కుటుంబం ఎందులోనైనా చిన్నచిన్న గొడవలు సహజం. కానీ, కొన్నిసార్లు వాగ్వాదాలు హద్దులు దాటుతాయి. విషయం చిన్నదే అయినా అంతులేని అంతరాన్ని పెంచుతుంది.  మరి అలా బంధాల మధ్య గొడవలు రాకూడదంటే ఏం చేయాలి ? వస్తే ఏం చేయాలి?

తగ్గి ఉండటం

ప్రేమ ఉన్న చోటే ద్వేషం కూడా ఉంటుందంటారు. అలాంటిది ఇద్దరి మధ్య గొడవలు రావటం అత్యంత సహజం. బంధం అన్నాక వాగ్వాదాలు జరుగుతూనే ఉంటాయి కనుక ఎవరో ఒకరు  కాస్త తగ్గి ఉంటే మంచిది.

తొందరపాటు వద్దు

గొడవ జరిగినప్పుడు వెంటనే సమస్యను పరిష్కరించాలని చూడొద్దు. మనల్ని మనం నిందించుకోకుడదు. అలాగని అవతలి వ్యక్తుల తప్పును ఎత్తి చూపడమూ సరికాదు. ఇద్దరి మనసులూ కాస్త స్తిమిత పడ్డాక మాట్లాడుకోండి.

పగ, ద్వేషం వద్దు

ఒకసారి జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని పగ సాధించడం, అభిప్రాయాలను దాచి పెట్టుకొని మౌనంగా ఉండటం కూడా తప్పే. ఇది మీకు కూడా శారీరక, మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.

తప్పులెంచకండి!

అవతలి వ్యక్తులు చెప్పే విషయం నచ్చకపోతే ప్రతిసారి చెప్పాల్సిన పనిలేదు. అలా చెప్పుకుంటే పోతే పరిస్థితి మరింత దిగజారుతుంది.

పాతవి తవ్వొద్దు

గతంలో జరిగిన విషయాలను తవ్వి మరి తీయకూడదు. ఇది గొడవను మరింత పెంచుతుంది. ప్రస్తుతం జరుగుతున్న విషయం గురించి మాత్రమే మాట్లాడాలి.

మాటలు జాగ్రత్త!

అవతలి వారిని బాధపెట్టే పదాలను, భాషను ఉపయోగించవద్దు. చిన్న మాట అయినా ముల్లులా గుచ్చుకుంటుంది. ఎంత కోపంలో ఉన్నా మీ భాషను సంభాలించుకోండి.

వాటి జోలికి వెళ్లొద్దు

మీ ఇద్దరూ విబేధించే విషయాల గురించి తీయకుంటే మంచింది. దీనివల్ల గొడవలు మరింత ముదురుతాయి. తర్వాత పరిష్కరించేదుకు కష్టమవుతాయి.

రాత్రి దాటనీయొద్దు

నిద్రపోయే కన్నా ముందే జరిగిన గొడవను పరిష్కరించుకోవాలి. రాత్రంతా అదే విషయం గురించి ఆలోచిస్తే  పరిస్థితులు మరింత జఠిలంగా మారతాయి.

అసలేం జరిగింది

వాగ్వాదం జరిగాక  వెంటనే అసలు ఏం జరగలేదు అన్నట్లుగా ప్రవర్తించడం మంచిది కాదు. క్షణాల్లోనే పరిస్థితులు మారిపోవని తెలుసుకోండి.

మూడో కంటికి

ఇద్దరి మధ్య జరిగిన గొడవల గురించి మరొకరికి చెప్పడం అస్సలు మంచిది కాదు. అది అవతలి వ్యక్తిపై మీకు నమ్మకం లేదని అర్థం వచ్చేలా చెబుతుంది. మీ గొడవల్లో మూడో వ్యక్తిని తీసుకురావద్దు.

క్షమాపణ

మనస్పర్థలు వచ్చినప్పుడు ముందుగా క్షమాపణ చెబితే విలువ ఉండదనే ఆలోచన సరికాదు. అది మన విలువను పెంచుతుంది కానీ తగ్గించదు.

మళ్లీ జరగకుండా

గొడవ ఎందుకు తలెత్తింది అనే విషయంపై ఎక్కువగా దృష్టి సారించాలి, భవిష్యత్తులో మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలి.

గొడవ రావొద్దంటే

భాగస్వామితో నిజాయితీగా ఏ విషయం దాచకుండా మాట్లాడాలి. అవతలి వ్యక్తి కోణం నుంచి చూసేందుకు ప్రయత్నించాలి. సర్దుకుపోవటానికి సిద్ధంగా ఉండాలి. వారి అభిప్రాయాలు, మనోభావాలను గౌరవించాలి.

గొడవలతో మంచి

కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు కూడా బంధాన్ని బలంగా చేస్తాయి. ఇద్దరు ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది. ఒకరిగురించి మరొకరు తెలుసుకొని అర్థం చేసుకునే స్వభావం వస్తుంది. గొడవలు ఇద్దరి మధ్య  నమ్మకం, సాన్నిహిత్యాన్ని పెంచుతాయి.

చివరగా

రిలేషన్ షిప్ సంతోషాన్ని ఇస్తుంది. బాధను కలిగిస్తుంది. ప్రతి గొడవలోనూ ఇద్దరి తప్పు ఉంటుందనేది మరిచిపోవద్దు. అలాంటప్పుడు కొన్నిసార్లు భాగస్వామిని గెలిపిస్తే తప్పేముంది. తగ్గడానికి ఆలోచించి దూరం పెంచుకునేకంటే, సర్దుకుపోతే ప్రయాణం సాఫీగా సాగుతుంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.