హార్దిక్ పాండ్యా

YouSay Short News App

ఇండియాకు భవిష్యత్తు కెప్టెన్ ఇతనేనా?

న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌కి హార్దిక్ పాండ్యా సారథిగా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా ఆడుతున్న తొలి అంతర్జాతీయ టీ20 ఇదే.

ప్లేయర్‌గా హార్దిక్ పాండ్యాకు మంచి రికార్డే ఉంది. అటు బౌలింగులో, ఇటు బ్యాటింగులో అంచనాలకు తగ్గట్టు రాణిస్తున్నాడు. కెప్టెన్‌గానూ హార్దిక్‌కి మంచి మార్కులే పడ్డాయి. అయితే, అతడి ప్రస్థానం ఎంతో విభిన్నం.

కెప్టెన్‌గా హర్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. సారథిగా వహించిన తొలి ఐదు మ్యాచుల్లో ఓటమి ఎరుగని కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్, విరాట్‌లకు సాధ్యం కాని ఫీట్ ఇది. న్యూజిలాండ్ సిరీస్‌లో 1-0తో సిరీస్‌ని కైవసం చేసుకున్నాక హార్దిక్ ఈ లిస్టులో చేరాడు. ఐర్లాండుతో రెండు టీ20లు, వెస్టిండీస్‌తో ఒక టీ20లో జయకేతనం ఎగరేశాడు.

అరుదైన ఘనత

తొలి పిలుపు..

ఐపీఎల్‌లో అడుగుపెట్టగానే హార్దిక్‌ని కెప్టెన్‌గా ప్రకటించి గుజరాత్ టైటాన్స్‌ ఫ్రాంచైజీ ఆశ్చర్యపరిచింది. హార్దిక్ నాయకత్వంపై పెద్దగా అంచనాలు లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో జట్టు నిర్ణయాన్ని అంతా విమర్శించారు.

భలే రికార్డు..

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా హార్దిక్ 15 మ్యాచులు ఆడాడు. ఇందులో 11 సార్లు జట్టుకు విజయాన్ని అందించాడు. సక్సెస్ రేటు 73.33శాతం కావడం గమనార్హం. ఆరంభ సీజన్‌లోనే జట్టును ఛాంపియన్‌గా నిలిపి అరుదైన ఘనత సాధించాడు.

ప్లేయర్‌గానూ..

కెప్టెన్సీ భారంతో చాలా మంది ఆటగాళ్లు లయ తప్పుతారు. కానీ, పాండ్యా మరింత బాధ్యతతో ఆడాడు. 15 ఇన్నింగ్సుల్లో 487 పరుగులు చేశాడు. 10 ఇన్నింగ్సుల్లో బౌలింగ్ చేసి 8 వికెట్లు రాబట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఐర్లాండ్‌తో..

కెప్టెన్‌గా టీమిండియాకు హార్దిక్ ఆడిన తొలి టీ20 సిరీస్ ఇది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఐర్లాండ్ సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెండు మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది.

తాత్కాలిక కెప్టెన్‌గానూ..

ప్రపంచకప్‌కి ముందు వెస్టిండీస్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ గైర్హాజరీలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించి 88 పరుగుల తేడాతో ఇండియాకు విజయాన్ని అందించాడు.

మరో కపిల్ దేవ్..

ఐపీఎల్‌లో ముంబై తరఫున చెలరేగి సెలక్టర్ల కంట పడ్డాడు హార్దిక్. చాన్నాళ్ల తర్వాత టీమిండియాకు కపిల్ దేవ్ లాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దొరికాడని భావించారు. అలా 2016లో టీ20, వన్డేల్లో పాండ్యా అరంగేట్రం చేశాడు.

ప్చ్…

అడపాదడపా ఇన్నింగ్సులు ఆడుతున్నా పాండ్యా కెరీర్ అంత గొప్పగా ఏమీ సాగలేదు. 2018 వరకు మోస్తరుగా రాణించాడు. ఫామ్‌లేమితో పాటు వెన్ను నొప్పి గాయం.. పాండ్యాకు శాపంగా మారింది. జట్టులో స్థానం చేజారింది.

సస్పెన్షన్..

2019 జనవరిలో హార్దిక్ వివాదాల్లో చిక్కుకున్నాడు. కాఫీ విత్ కరన్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీసీసీఐ నుంచి సస్పెన్షన్‌ని ఎదుర్కొన్నాడు. క్షమాపణలు చెప్పినా బోర్డు కరుణించలేదు. విచారణ అనంతరం అంతర్గతంగా చర్చించి బీసీసీఐ సస్పెన్షన్‌ని ఎత్తివేసింది.

సెర్బియన్‌తో వివాహం..

హార్దిక్ ఫుల్ టైం ఆల్‌రౌండర్‌గా మళ్లీ ఫామ్‌లోకి రావడానికి శ్రమిస్తున్న సమయమది. 2020లో సెర్బియా డాన్సర్ నటాశా స్టాన్‌కోవిక్‌ని వివాహమాడి మరోసారి చర్చల్లో నిలిచాడు. అదే ఏడాది అగస్త్యకు వీరు జన్మనిచ్చారు.

పరిణతి..

తండ్రయ్యాక హార్దిక్‌లో చాలా పరిణతి కనిపించింది. ఆట తీరులో దూకుడును ప్రదర్శిస్తూనే మైదానంలో శాంతంగా ఉండటం అలవరుచుకున్నాడు. అలా గుజరాత్ టైటాన్స్ నుంచి పిలుపు అందుకుని కెప్టెన్‌గా కప్పు సాధించి పెట్టాడు.

ఫినిషర్‌గానూ..

వరల్డ్‌కప్‌కి ముందు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీసుల్లో హార్దిక్ మరోసారి నిరూపించుకున్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా కనిపిస్తూ పరుగులు రాబట్టాడు. ఫినిషర్‌గా కీలక పాత్ర పోషించి టీమిండియాకు విజయాలను అందించాడు.

భవిష్యత్ కెప్టెన్..

టీమిండియాకు భవిష్యత్ కెప్టెన్ అయ్యే అవకాశాలు హార్దిక్‌కి పుష్కలంగా ఉన్నాయి. ఫామ్‌ని ఇలాగే కొనసాగిస్తూ జట్టును నడిపిస్తే తప్పకుండా 2024లో అతడే కెప్టెన్‌ అవుతాడు. కెప్టెన్సీ రేసులో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌ల కన్నా హార్దిక్ ఒక మెట్టు పైన ఉన్నాడు.

గొప్ప నాయకుడు..

మైదానంలో ప్రశాంతంగా కనిపిస్తూనే తన వ్యూహాలతో విజయ ఢంకాను మోగించగల సమర్థుడు హార్ధిక్. ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఈ విషయం నాకు స్పష్టమైంది. నైపుణ్యంతో పాటు నాణ్యమైన ఆట అతని సొంతం.

వీవీఎస్ లక్ష్మణ్(తాత్కాలిక కోచ్)

నా కెప్టెన్..

నేనే సెలక్టర్‌ని అయితే కెప్టెన్‌గా నా తొలి ఎంపిక  హార్దిక్ పాండ్యానే. 2024 ప్రపంచకప్ పగ్గాలు  అతడికే అప్పజెబుతా.

కె.శ్రీకాంత్(మాజీ క్రికెటర్)

చాలా సంతోషం..

ఫుల్‌టైం కెప్టెన్‌గా అవకాశం వస్తే అంతకన్నా సంతోషమేముంది. ఆనందంతో, రెట్టించిన ఉత్సాహంతో నాయకత్వం వహిస్తా.

హార్దిక్ పాండ్యా