శ్రీలంకతో రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3 వన్డేల సిరీస్‌ని 2-0తో సొంతం చేసుకుంది.
రెండో వన్డేలో టీమిండియా విజయానికి ప్రధాన కారణం బౌలింగే. టాస్ ఓడిపోయినా.. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ప్రత్యర్థి జట్టు 215 పరుగులకే ఆలౌట్ అయింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. గత మ్యాచులో వీరవిహారం చేసిన బ్యాటర్లు ఈ మ్యాచులో నిలబడలేక పోయారు.
మిడిలార్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ చివరి వరకు నిలిచి టీమిండియాను గెలిపించాడు. 103 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ విజయం కోసం టీమిండియా కష్టపడాల్సి వచ్చింది. రాహుల్‌కి తోడుగా శ్రేయస్, హార్దిక్, అక్షర్ పటేల్ నిలవడంతో ఛేజింగ్ కాస్త సులువైంది.
హార్దిక్ పాండ్యా(36), శ్రేయస్ అయ్యర్(28), అక్షర్ పటేల్(21), గిల్(21) రోహిత్(17), కోహ్లీ(4) పరుగులు చేశారు. కుల్‌దీప్ యాదవ్(10*) విన్నింగ్ షాట్ కొట్టాడు.
స్వల్ప స్కోరును కాపాడుకోవడంలో శ్రీలంక బౌలర్లు మెరుగ్గా పోరాడారు. కరుణరత్నె, లాహిరు కుమార రెండేసి వికెట్లు తీసుకోగా.. ధనంజయ, రజిత చెరో వికెట్ పడగొట్టారు. మిగతావారు పొదుపుగా బౌలింగ్ చేశారు.
శ్రీలంక బ్యాటింగు పతనాన్ని ప్రారంభించింది మాత్రం కుల్‌దీప్ యాదవే. కీలక సమయంలో కుశాల్ మెండిస్‌ని ఔట్ చేసి ప్రమాదకరంగా మారుతున్న మెండిస్, నువైందు ఫెర్నాండోల భాగస్వామ్యాన్ని విడదీశాడు.
అర్ధశతకం పూర్తి చేసిన నువైందు ఫెర్నాండోను రన్ అవుట్ చేయడంతో శ్రీలంక బ్యాటింగ్.. గాడి తప్పింది. ఆ తర్వాత ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయారు.
భారత బౌలర్లలో సిరాజ్(3/30), కుల్‌దీప్ యాదవ్(3/51), ఉమ్రాన్ మాలిక్(2/48) రాణించగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు.
స్కోర్లు: శ్రీలంక 215/10 (39.4), భారత్ 219/6 (43.2)మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: కుల్‌దీప్ యాదవ్