హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా త్రుటిలో ఓటమి తప్పించుకుంది. గిల్ డబుల్ సెంచరీతో భారీ స్కోరును అందించినా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్ భారత్ వెన్నులో వణుకు పుట్టించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాను గిల్ జిగేల్‌మనే ఇన్నింగ్స్‌తో నడిపించాడు. పిచ్ కొంచెం బౌలర్లకు సహకరిస్తున్నా.. ఒక్కడే పది మందిలా డబుల్ సెంచరీతో టీమిండియాకు భారీ స్కోరు అందించాడు.
రోహిత్, శుభ్‌మన్ గిల్ భారత్‌కు మంచి ఓపెనింగే అందించారు. 60 పరుగుల భాగస్వామ్యం తర్వాత..34 పరుగులు చేసిన రోహిత్ ఔటయ్యాడు.
కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5) విఫలమైనా సూర్యకుమార్ యాదవ్ (31) గిల్‌కు చక్కటి సహకారం అందించాడు. హార్దిక్ పాండ్యా (28), సుందర్ (12) కూడా గిల్ ఇన్నింగ్స్‌కు ప్రేక్షక పాత్ర వహించారు.
ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు గిల్ మాత్రం రెచ్చిపోయి ఆడాడు. అంతా 100 స్ట్రయిక్ రేట్‌తో ఆడేందుకు ఇబ్బంది పడుతున్న చోట 87 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయి ఆడిన గిల్ 145 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. ఉప్పల్‌లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు (175)ను బద్దలు కొట్టాడు.
గిల్ తర్వాత టీమిండియాలో అత్యధిక స్కోరు రోహిత్(34)దే. 149 బంతుల్లో 208 పరుగులు చేసిన గిల్… భారత్‌కు 349 పరుగుల భారీ స్కోరు అందించాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆదిలో లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. వరుస ఇంటర్వెల్స్‌లో వికెట్లు కోల్పోతూ 131 ఆరు వికెట్లు కోల్పోయింది.
131కే 6 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ ఆదుకున్నారు. 162 పరుగుల పార్ట్‌నర్‌షిప్ అది కూడా ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడి చేసి భారత్‌ను వణికించారు.
ఈ మధ్య స్థిరంగా వికెట్లు తీస్తున్న సిరాజ్ మరోసారి మెరిశాడు. 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. బ్రెస్‌వెల్, శాంట్నర్ చెలరేగి ఆడుతున్న వేళ..46 ఓవర్ వేసి శాంట్నర్, షిప్లేను ఔట్ చేసి భారత్‌కు ఊపిరినిచ్చాడు.
బ్రేస్‌వెల్ న్యూజిలాండ్‌ను విజయపు అంచులదాకా తీసుకెళ్లాడు. చివరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సిన వేళ..తొలి బంతికే సిక్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాత LBWగా ఔటయ్యాడు.
భారత్ వెన్నులో వణుకు పుట్టించిన బ్రేస్‌వెల్ 57 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 78 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ చేసిన గిల్ 9 సిక్స్‌లు కొడితే..140 పరుగుల్లోనే బ్రేస్‌వెల్ 10 సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు.
భారత్ ఇన్నింగ్స్ 349-8న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 337-10ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ శుభ్‌మన్ గిల్