BF.7 అంత ప్రమాదమా?

YouSay Short News App

కరోనా కొత్త వేరియంట్

కరోనా నాలుగో దశ ముగిసి దాదాపు ఏడాది పూర్తయ్యింది. పెద్దగా ప్రభావం లేకపోవటంతో చూస్తుండగానే నెలలు గడిచిపోయింది. ఇక రాదులే అనుకొని ఎంచక్కా ఎగిరిగంతేసిన వారిని మరోసారి కలవర పెట్టేందుకు రాణేవస్తుంది మహమ్మారి BF.7.

చైనాలో ఇప్పటికే పంజా విసిరిన ఈ కొవిడ్ వేరియంట్. బీజింగ్, డెన్మార్క్, బ్రిటన్ వంటి దేశాలకు పాకింది. మనదేశంలోనూ కేసులు బయటపడ్డాయి. అన్నట్టూ దీని గురించి పూర్తిగా తెలుసుకోవటమే కాకుండా మూలనదాచిన మాస్కులను బయటకు తీయండి.

BF.7

ఈ BF.7 అనేది కొత్త కరోనా వేరియంట్. సులభంగా చెప్పాలంటే చెట్టుకు కొమ్మలు ఉన్న మాదిరిగా… ఇందులో కూడా విభాగాలు ఉంటాయి. ఒమిక్రాన్‌ వేరియంట్ BA.5 నుంచి పుట్టిన మరో మ్యూటెంట్‌.

ఎక్కడ్నుంచి వచ్చింది

ఇంకా ఎక్కడ పుడుతుంది మీరు ఊహించినట్లు చైనాలోనే. అక్కడ ప్రజా ఆందోళనల నేపథ్యంలో జీరో కొవిడ్ నిబంధనలు ఎత్తివేయగానే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. అమెరికా, జపాన్, బ్రెజిల్ వంటి దేశాలకు విస్తరించింది.

వేరియంట్ ప్రభావం

BF.7 ప్రభావం వేగంగా ఉంటుందని నిపుణుల అంచనా. ఒమిక్రాన్‌ కంటే రెట్టింపు వేగంతో అతి తక్కువ సమయంలోనే వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే కొవిడ్‌ సోకిన వారికి కూడా మళ్లీ వచ్చే ప్రమాదం ఉంది. రెండు డోసులు వేసుకున్నప్పటికీ దీని బారిన పడే అవకాశం లేకపోలేదని నిపుణుల అంచనా.

వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. యాంటీబాడీలను చంపటంలేదని గుర్తించినట్లు తెలుస్తోంది.

లక్షణాలు

కరోనా నాలుగు దశల్లో ఉన్న లక్షణాలే ఇప్పుడు కూడా ఉంటాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఆయాసం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ముక్కు కారడం వంటివి లక్షణాలుగా కనిపిస్తున్నాయి.

భారత్‌లో నవంబర్‌లోనే

చాలా దేశాల్లో ఇప్పటికే కొత్త వేరియంట్ విస్తరించింది. కానీ, భారత్‌లో దీనికి సంబంధించి నవంబర్‌లోనే గుర్తించినట్లు సమాచారం. ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్‌గా పుడుతుందని వైద్యులు కనిపెట్టారట.

కేసులు వచ్చేశాయి

భారత్‌లోనూ BF.7 కరోనా కేసులు వెలుగు చూశాయి. గుజరాత్‌లో ఇద్దరికి, ఒడిశాలో మరో ఇద్దరిలో వైరస్‌ను కనుగొన్నారు. వారికి చికిత్స అందిస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన సర్కారు…వ్యాప్తిని నిరోధించడానికి వ్యూహాలు రచిస్తోంది.

ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశమైన కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవియా ..కొత్త వేరియంట్‌ గురించి ఆరా తీశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.

అప్పుడే ఐపోలేదు

దాదాపు సంవత్సరం పాటు కరోనా కేసులు రాకపోవటంతో అంతా కరోనా గురించి ఆలోచించడం మానేశారు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది.

చైనాలో ఈ వేరియంట్ కారణంగా ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య వేలల్లో ఉంది. అక్కడి ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోక కింద పడుకోబెట్టి చికిత్స చేస్తున్న పరిస్థితికి దిగజారింది.

పండగల వేల పైలం

మరోసారి వైరస్ విస్తరించే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించడం అవసరం. మాస్కులు ధరించాలి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలి.

ప్రయాణాలు తక్కువ చేయటం మంచిది. లక్షణాలుంటే పరీక్షకు వెళ్లండి. చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం సాధారణంగా వస్తాయి కానీ, తెలుసుకుంటే మంచిది.