స్టార్ హీరోయిన్ల ప్రేమ, పెళ్లిపై నిత్యం ఏదో ఒక వార్త పుట్టుకొస్తూనే ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్‌తో ఉన్న కీర్తి సురేశ్ ప్రేమ వ్యవహారంపై తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కీర్తి సురేశ్ తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 13 ఏళ్లుగా వీరు సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కొంతమంది చెబుతున్నారు.
ఈ అందాల ముద్దుగుమ్మ మనసులో ఉన్న ఆ చిననాటి ప్రియుడు ఇప్పుడు ఓ వ్యాపారవేత్తనట. కేరళలో అతడికి రిసార్ట్స్ ఉన్నాయని సమాచారం.
అయితే ఇప్పుడప్పుడే వీరు పెళ్లి చేసుకునే ఆలోచనలో లేరంట. కెరీర్ పరంగా దూసుకుపోతున్న కీర్తి మరో నాలుగేళ్ల తర్వాతనే వివాహబంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుందట.
గతంలోనూ కీర్తి పెళ్లిపై చాలా పుకార్లే వచ్చాయి. కొలివుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో ఈ సుందరి ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. అవన్నీ ఫేక్ ముచ్చట్లేనని కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు.
ఓ వ్యాపారవేత్తతో కీర్తికి పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కానీ వాటిపైన కీర్తి గానీ వారి కుటుంబ సభ్యులు గానీ స్పందించలేదు.
ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్‌తోనూ ఆమె పేరును జతచేస్తూ కొన్ని పుకార్లు షికారు చేశాయి. ఈమె కారణంగా విజయ్ విడాకులు కూడా తీసుకోబోతున్నాడంటూ ప్రచారం చేశారు. కానీ వీటిపైన కూడా కీర్తి స్పందించలేదు.
కెరీర్ పరంగా మాత్రం కీర్తి ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. తెలుగులో నాని ‘దసరా’, చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాల్లో నటిస్తోంది. వీటితోపాటు ‘మామన్నన్’, ‘రఘు తాతా’, ‘రివాల్వర్ రీటా’ వంటి తమిళ సినిమాల్లోనూ మెరవబోతోంది.