ఆన్‌లైన్‌లో అమ్మాయి కోసం వెతుకుతున్నారా?

YouSay Short News App

ఈ కొత్త రకం సైబర్‌ మోసాలు తెలుసుకోండి

సైబర్‌ మోసాలు అంటే చదువుకోని అమాయకులకు  ఓటీపీల చీటింగ్, షాపింగ్‌ గోల్‌మాల్‌తో మాత్రమే జరిగేదనుకుంటే పొరపాటే. బాగా చదువుకున్న వారు, ముఖ్యంగా యువకులు టార్గెట్‌గా సైబర్ వలలు అల్లుతున్నారు.

యువకులు బాగా ఆసక్తి కనబరిచే అంశాలైన లవ్‌, డేటింగ్‌, జాబ్‌ లాంటి వాటినే ఎరగా వేసి దోచేస్తున్నారు.

నకిలీ వివాహ పరిచయ వేదికలు

వివాహ పరిచయ వేదిక ద్వారా అమ్మాయి పరిచయమవుతుంది. వాట్సాప్‌లో చాట్‌ చేస్తుంది. కాఫీ క్లబ్‌లు, పార్కుల్లో పెళ్లి చూపులు ఉంటాయి. అప్పడప్పుడూ షికార్లు, బహుమతులు, పాకెట్‌ మనీ, అవసరాలు అంటూ అబ్బాయికి తడిసి మోపెడవుతుంది.

చివరికి ఆ అమ్మాయి మన ఇద్దరికి సెట్ అవ్వదంటూ బ్రేకప్ చెప్పేస్తుంది. గట్టిగా నిలదీస్తే లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తుంది. పెళ్లికాని, అయినా విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు పన్నుతున్న వల ఇది

ముందుగానే కొంతమంది అమ్మాయిలను ఉద్యోగంలో చేర్చుకుంటారు. వారి టెలీకాలర్స్‌గా పనిచేసే  ఆ అమ్మాయిలతోనే మీతో చాటింగ్‌, డేటింగ్‌ చేయిస్తారు. చివరికి అందినకాడికి దోచుకుని నెత్తిమీద కుచ్చుటోపీ పెడతారు

వలపు వల

గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ వస్తుంది. కవ్వించే మాటలతో రెచ్చగొడుతుంది. యువకుడిలో ఉద్రేకం పెరిగేలా వీడియో కాల్‌ చేస్తుంది. నగ్నంగా మాట్లాడుతుంది.

యువకుడిని కూడా నగ్నంగా మాట్లాడమని కోరుతుంది. పొరపాటున ఆ పని చేశారంటే వారి పని గోవిందా. వీడియో రికార్డ్‌ చేసి ఆ తర్వాత దానిని సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించి డబ్బు గుంజుతారు.

నిజానికి ఇలాంటి కేసుల్లో వీడియో కాల్‌ చేసేది మహిళ కానే కాదు. ఎవరో ఒక అబ్బాయి అంతకు ముందే రికార్డ్ చేసి ఉన్న వీడియోతో మిమ్మల్ని బురిడీ కొట్టిస్తాడు

డేటింగ్‌ యాప్స్‌

మార్కెట్‌లో ఫేక్‌ డేటింగ్‌ యాప్స్‌ కోకొల్లలు ఏది సరైనదో తెలుసుకోవడం కష్టమే. ఇదే అస్త్రంగా యువకుకు వల వేస్తున్నారు. కొందరేమో అసలైన డేటింగ్‌ యాప్స్‌లోనూ ఫేక్‌ ప్రొఫైల్స్‌తో యువకులకు పరిచయమవుతున్నారు.

తొలుత ఫ్రెండ్‌గా రుచులు, అభిరుచులు తెలుసుకుంటూ ప్రేమగా మాట్లాడుతూ నమ్మకం పెంచకుంటారు. ఇంట్లో వాళ్లకు సమస్య ఉందనో, ఆపరేషన్‌ ఖర్చులనో చెప్పి పైసలు లాగి పత్తా లేకుండా పోతారు

వేశ్య యాప్స్‌

అందమైన యువతుల ఫోటోలు పెట్టి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలతో ఆకట్టుకుంటారు. డబ్బులు ఇచ్చి వారితో శారీరక సుఖం పొందొచ్చని చెబుతారు. కాస్త ఉత్సాహం చూపించారా మీ పని అంతే!

అసలు ఆ అమ్మాయిలెవరూ వారి దగ్గర ఉండరు. అవన్నీ ఫేక్‌ ఫోటోస్‌. కేవలం మీ బలహీనతను వాడుకుని డబ్బులు గుంజుతారు. ఇంకా కొందరైతే మీ కాల్స్, చాట్స్‌ సేవ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసి కూడా పైసలు లాగుతారు

ఉద్యోగం

ఉద్యోగం చాలా మంది కల. ఇదే సైబర్ నేరగాళ్లకు వరమవుతోంది. రైల్వే, గవర్నమెంట్‌ జాబ్స్‌, కళాశాలల్లో సీట్ల పేరిట కూడా మోసం చేస్తున్నారు. చాలా మంది డబ్బు కట్టి నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్లతో కార్యాలయానికి వెళ్లి మోసపోతున్నారు.

వీరు మొదట ఓ మధ్యవర్తి లాగా ఫోన్‌ చేస్తారు.  ఆ తర్వాత ఉద్యోగానికి రేటు కడతారు. పక్కా అధికారిక డాక్యుమెంట్ల లాగా పత్రాలు క్రియేట్‌ చేస్తారు. మిమ్మల్ని నమ్మించడానికి సదరు కార్యాలయాలకు వెళ్లినట్లు ఆధారాలు కూడా చూపిస్తారు.

ఇండియాకు వివిధ కారణాలతో వచ్చిన నైజీరియన్లు ఎక్కువగా ఈ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మీరు మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930 నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.