NZvsENG: చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌ ఒక్క పరుగుతో గెలిచిన న్యూజిలాండ్‌

YouSay Short News App

ఎవరన్నారు టెస్ట్‌ క్రికెట్‌ అంత మజాగా ఉండదని! ఎవరన్నారు సీట్లకు అతుక్కుపోయి గోర్లు అరిగిపోయేలా కొరుక్కునే ఉత్కంఠ టీ20లకు మాత్రమే సొంతమని.!! వారికి ఇంగ్లండ్‌-న్యూజిలాండ్ రెండో టెస్ట్ చూపించండి.

ఓటమి ఖాయమైన వేళ డ్రా చేసుకోవడం కూడా కష్టమైన వేళ గెలవడమెలాగో న్యూజిలాండ్‌ జట్టు మరోసారి నిరూపించింది. చివరి రక్తపుబొట్టు వరకూ పోరాడటం అంటే ఏమిటో క్రికెట్‌ ప్రపంచానికి మరోసారి చాటింది.

కేవలం ఒక్కటి అంటే ఒకే ఒక్క పరుగుతో విజయం సాధించి క్రికెట్‌ చరిత్రలో మరిచిపోలేని విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్‌ జట్టును జీవితాంతం వేధించే ఓటమిని రుచిచూపించింది.

వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో అద్భుత పోరాట స్పూర్తికి నిలువెత్తు నిదర్శనంలా న్యూజిలాండ్‌ జట్టు నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలి ఫాలో ఆన్‌ ఆడినా ప్రత్యర్థికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.

టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌..తొలి ఇన్నింగ్స్‌ 435-8 వద్ద డిక్లేర్‌ చేసింది. జో రూట్‌ 153(224)కు అన్‌స్టాపబుల్‌ హ్యారీ బ్రూక్‌ 186(176) తోడవడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 209 పరుగులకే కుప్పకూలింది. బ్రాడ్‌ 4వికెట్లు, ఆండర్సన్‌, లీచ్‌ చెరో 3 వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు.  కెప్టెన్‌ టిమ్ సౌథీ 73 ఒక్కడే రాణించాడు.

ఫాలోఆన్‌ ఆడేందుకు వచ్చిన న్యూజిలాండ్‌కు కేన్‌ విలియమ్సన్‌ (132) సెంచరీతో పాటు లాథమ్(83), బ్లండెల్‌ (90) ఇన్నింగ్స్‌ తోడవడంతో 483 పరుగుల భారీ స్కోరు చేసింది.

258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు న్యూజిలాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనుకున్న వేళ వరుసగా వికెట్లు తీశారు.

జోరూట్‌ ఒక్కడే ఎదురుదాడి 113 బంతుల్లో 95 కొట్టాడు. కానీ విజయానికి ఇంకా 43 పరుగులు కావాల్సిన వేళ ఇంగ్లండ్‌ 8 వికెట్లు కోల్పోయింది.

వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్ ఒక్కడే బంతిని స్ట్రైక్‌ చేస్తూ జట్టును ముందుకు తీసుకెళ్లి దాదాపుగా విజయతీరానికి తీసుకెళ్లాడు. ఇంకా 7 పరుగులు చేయాల్సిన వేళ సౌథీ బౌలింగ్‌లో ఫోక్స్‌ ఔటయ్యాడు.

లీచ్‌ సింగిల్‌, ఆండర్సన్‌ ఫోర్‌ కొట్టడంతో విజయానికి ఇంకా 2 పరుగులే అవసరమయ్యాయి. ఆ సమయంలో సౌథీ మరో మెయిడిన్ ఓవర్ వేశాడు.

రెండు పరుగులు అవసరం.. స్ట్రైక్‌లో ఆండర్సన్‌ ఉన్నాడు. బౌలింగ్‌కు వాగ్నర్‌ వచ్చాడు. ఉత్కంఠకరంగా అందరూ చూస్తున్నారు. అలాంటి సమయంలో ఆండర్సన్‌ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

కేవలం ఒక్క పరుగుతో న్యూజిలాండ్‌ సంచలన విజయం నమోదు చేసింది. ఫాలో ఆన్‌ ఆడి గెలవడం చరిత్రలో ఇది నాలుగోసారి మాత్రమే.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.