7 సిక్సులు బాదిన రుతు‘రాజు’.. క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నమోదు

YouSay Short News App

ఏడు సిక్సులు

క్వార్టర్‌ఫైనల్లో ఉత్తర్‌ప్రదేశ్ జట్టుపై రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. ఓవర్లో ఒక నో బాల్ అవకాశం రావడంతో 7బంతుల్లో 7 సిక్స్‌లు బాదాడు. స్పిన్నర్ శివసింగ్‌ బౌలింగుని ఉతికారేసి.. 42 పరుగులను రాబట్టాడు.

ప్రపంచ మొనగాడు

అన్ని ఫార్మాట్లలో ఇలా ఒకే ఓవర్లో 7 సిక్స్‌లు బాదడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన మొనగాడిగా రుతురాజ్ గైక్వాడ్ చరిత్ర లిఖించాడు.

అ‘ద్వితీయ’ శతకం

ఏడు బంతుల్లో ఏడు సిక్స్‌లు బాదడమే కాక.. రుతురాజ్ గైక్వాడ్ ద్విశతకం నమోదు చేయడం విశేషం. 159బంతుల్లో 220 పరుగులు చేశాడు. ఇందులో 10ఫోర్లు, 16 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో యూపీకి 330పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి 272కి మహారాష్ట్ర ఆలౌట్ చేసింది.

రోహిత్ శర్మ సరసన..

ఈ భీకర ఇన్నింగ్సుతో రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఒక ఇన్నింగ్సులో అత్యధిక సిక్స్‌లు(16) బాది రోహిత్‌శర్మకు సరిసాటిగా నిలిచాడు.

చెన్నైకి ఆశాకిరణం

ఐపీఎల్ మినీ వేలం 2022 ముంగిట రుతురాజ్ గైక్వాడ్‌ని చెన్నై సూపర్ కింగ్స్ ఇటీవల రిటైన్ చేసుకుంది. రూ.6కోట్లు చెల్లించి ఈ ఓపెనర్‌ని అట్టిపెట్టుకుంది. చెన్నైకి ఇతడొక ఆశాకిరణం.

పరుగుల రుతు‘రాజు’

2021 ఐపీఎల్ సీజన్‌లో హీరో మన రుతారాజే.  ఈ సీజన్‌లో చెన్నై తరఫున ఆడి ఏకంగా 653 పరుగులు చేశాడు. రాజస్థాన్‌పై అజేయ సెంచరీని నమోదు చేసి ఆరెంజ్ క్యాప్‌ని దక్కించుకున్నాడు.

ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్

ఇదే సీజన్‌లో రుతురాజ్ మరో ఘనత సాధించాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డునూ సొంతం చేసుకున్నాడు.  ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై అత్యధ్బుతంగా ఆడి చెన్నైకి కప్పును అందించాడు.

విరాట్‌తో సమంగా..

విజయ్ హజారే ట్రోఫీలో గైక్వాడ్ సాధించిన మరో రికార్డు ఇది. ఒక సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసి ఈసారి కోహ్లీతో సరిసమానంగా నిలిచాడు. 2021-22 సీజన్‌లో మహారాష్ట్ర తరఫున ఈ బ్యాట్స్‌మన్ 600కు పైగా పరుగులు చేసి టాప్‌లో నిలిచాడు.

వరల్డ్‌కప్‌లో దక్కని చోటు

ఐపీఎల్‌లో రాణించిన అనంతరం గైక్వాడ్‌కి టీమిండియా నుంచి పిలుపొచ్చింది. 2021లో శ్రీలంకతో మ్యాచులో రుతురాజ్ అరంగేట్రం చేశాడు. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ 2022 పొట్టి ప్రపంచకప్‌నకు జట్టులో చోటు లభించలేదు.

జట్టులో ఉండాల్సింది..!

సంజు శాంసన్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా టీమిండియా తరఫున ఆడే అర్హత ఉందని అభిమానులు అంటున్నారు. తాజా ప్రదర్శనతో గైక్వాడ్‌ తనేంటో నిరూపించుకున్నాడని చెబుతున్నారు. న్యూజిలాండ్ పర్యటనలో రుతురాజ్ జట్టులో ఉండాల్సిన ఆటగాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

టీమిండియా భవిష్యత్..

టీమిండియా భవిష్యత్ ఇతనేనని అభిమానులు విశ్వసిస్తున్నారు. రానున్న కాలంలో భారత్‌కు కీలక ఆటగాడిగా మారుతాడని చెబుతున్నారు. వచ్చే సిరీస్‌ల్లో‌నైనా రుతురాజ్‌కి చోటు కల్పించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీకి సూచిస్తున్నారు.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం  వెబ్‌సైట్‌ని చూడండి.  కింద లింక్‌ని క్లిక్ చేసి యాప్‌ని  డౌన్‌లోడ్ చేసుకోండి.