సంజూ శాంసన్ కాంట్రవర్సీ కహానీ

YouSay Short News App

సంజూ శాంసన్.ప్రస్తుతం వార్తల్లో మార్మోగుతున్న పేరు.. టీమిండియాలో అతడికి సరైన స్థానం కల్పించడం లేదనేది ప్రధాన ఆరోపణ. టీ-20 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసినప్పటి నుంచి ఇప్పటివరకు సంజూ గురించి ప్రస్తావన వస్తూనే ఉంది.

పంత్ విఫలమవ్వటం కూడా ఇందుకు ప్రధాన కారణం. మరి అతడికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు. ఇచ్చినా సంజూ సద్వినియోగం చేసుకోలేదా కారణాలేంటి ?

సంజూ శాంసన్

కేరళకు చెందిన సంజూ శాంసన్ చాలా త్వరగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా టీమిండియాలోకి వచ్చాడు.. IPLలో తనదైన ప్రదర్శనతో ఏకంగా రాజస్థాన్‌కు కెప్టెన్‌గా మారి జట్టును నడిపిస్తున్నాడు.

రికార్డులు

సంజూ భారత్ తరఫున 11 వన్డేలు ఆడి 104 స్ట్రైక్‌రేటుతో 330 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. టీ-20లోనూ 16 మ్యాచుల్లో 135.16 స్ట్రైక్ రేట్ తో 296 పరుగులు సాధించాడు. ఐపీఎల్ కెరీర్ లో 138 మ్యాచుల్లో 3526 పరుగులు చేశాడు.

వివాదం

టీ-20 ప్రపంచకప్ కు జట్టును ఎంపిక చేసినప్పటి నుంచి సంజూ శాంసన్ వివాదం నడుస్తోంది. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా ఉన్న అతడిని తీసుకోకపోవటంపై క్రికెట్ అభిమానులు తప్పుబట్టారు.

దేశవాలీ క్రికెట్ లో సత్తా చాటుతున్నప్పటికీ అతడికి జట్టులో సరైన స్థానం కల్పించడం లేదని సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడిచింది.

కివీస్ సిరీస్‌కు ఎంపిక

అభిమానులు, విశ్లేషకుల నుంచి నిరసనలు వెల్లువెత్తున్న వేళ ఎట్టకేలకు సంజూని న్యూజిలాండ్‌తో టీ-20 , వన్డే సిరీస్‌లకు ఎంపిక చేశారు.

మళ్లీ మెుదటికి

కివీస్‌తో సిరీస్‌లకు ఎంపిక చేసినప్పటికీ సంజూ శాంసన్‌కు టీ-20 మ్యాచ్‌లలో తుది జట్టుకు ఎంపిక చేయలేదు. ఆడిన మూడు మ్యాచుల్లో ఒకటి వర్షార్పణం కాగా మిగతా రెండింట్లోనూ అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు.

వన్డే జట్టులో

ఎట్టకేలకు మెుదటి వన్డేలో సంజూకి అవకాశం ఇచ్చారు. జట్టు వికెట్లు పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చి శ్రేయస్ అయ్యర్‌తో కలిపి భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు సాధించాడు.

మెుదటి వన్డేలో ఫర్వాలేదనిపించినప్పటికీ రెండో వన్డేలో జట్టులోకి తీసుకోలేదు. దీంతో మళ్లీ బెంచ్‌కే   పరిమతం అయ్యాడు. వర్షం పడుతుంటే గ్రౌండ్స్‌మెన్‌కు సహాయం చేస్తూ కనిపించాడు.

ఎందుకిలా ?

సంజూ శాంసన్ రాణిస్తున్నప్పటికీ అతడి స్థానంలో మరికొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా పంత్‌ను ప్రత్యామ్నాయంగా చూసి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. కానీ, అతడు విఫలమవుతుండటంతో విమర్శలు వస్తున్నాయి.

గత అనుభవం

ప్రపంచకప్‌కు ముందు సంజూకి ద్వైపాక్షిక సిరీస్‌లలో అవకాశం కల్పించారు. కానీ, వాటిని పెద్దగా ఉపయోగించుకోలేదని భావిస్తారు. తర్వాత మళ్లీ పుంజుకున్నప్పటికీ కొత్తవాళ్లు కూడా అప్పటికే వారి ప్రదర్శనతో ఆకట్టుకోవటంతో కాస్త అవకాశాలు తగ్గాయి.

చివరిగా

ప్రస్తుతం టీమిండియాలో కుర్రాళ్లు అదరగొడుతున్నారు. వారితో సంజూ పోటీపడాల్సి ఉంది. మళ్లీ తనదైన ప్రదర్శన ఇచ్చి కీలక ఇన్నింగ్స్ లు ఆడితే జట్టులో స్థానం సుస్థిరంగా ఉంటుంది.