గత 7 ఏళ్లలో సంక్రాంతి హిట్లుగా నిలిచిన

తెలుగు సినిమాలివే..!

టాలీవుడ్‌ సినిమాలకు.. సంక్రాంతి ఎంతో ప్రత్యేకం. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఈ వేడుకకు నువ్వా-నేనా అన్నట్లుగా సినిమాలు పందెంకోళ్లలా బరిలోకి దిగుతుంటాయి.

వీటిల్లో కొన్ని హిట్టయితే; మరికొన్ని అలా వచ్చి.. ఇలా వెళ్లిపోతాయి. గత ఏడేళ్లుగా సంక్రాంతికి విడుదలైన సినిమాలేంటో ఓ లుక్కేద్దామా..!

వెంకటేశ్, పవన్ కళ్యాణ్‌ల మల్టీస్టారర్‌ చిత్రం ‘గోపాల గోపాల’. 2015లో సంక్రాంతి బరిలోకి దిగి మంచి విజయాన్ని సాధించింది. ఇదే సమయంలో విడుదలైన విక్రమ్-శంకర్‌ల ‘ఐ’ సినిమా మిశ్రమ స్పందనను రాబట్టింది.

2015  - ‘గోపాల గోపాల’

ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’, బాలకృష్ణ ‘డిక్టేటర్’, శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ 2016 సంక్రాంతికి పోటీపడ్డాయి. వీటిల్లో నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయనా, ఎక్స్‌ప్రెస్ రాజా మంచి విజయాన్ని సాధించగా.. డిక్టేటర్ సినిమా సంక్రాంతి రుచి చూపలేకపోయింది.

2016  - ‘నాన్నకు ప్రేమతో’  ‘సోగ్గాడే చిన్నినాయనా’ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీగా విడుదలైన చిత్రం ‘ఖైదీ నెం.150’. ఈ మూవీ మెగా అభిమానుల్లో మంచి జోష్ ఇచ్చింది. బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, శర్వానంద్ ‘శతమానంభవతి’ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించాయి.

2017  - ‘ఖైదీ నెం- 150 ,’‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘శతమానంభవతి’

ఈ ఏడాది సంక్రాంతి బాలకృష్ణదే. ‘జై సింహా’ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకోగా.. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ పూర్తిగా నిరాశపరిచింది.

2018  - ‘జై సింహా’

2019 సంక్రాంతికి అసలైన వినోదం అందించిన సినిమా ‘ఎఫ్2’. వరుణ్ తేజ్‌తో కలిసి వెంకటేశ్ మరోసారి మల్టీస్టారర్ సినిమాలో మెరిశాడు. మరోవైపు, బాలకృష్ణ ‘కథానాయకుడు’, రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

2019  - ‘ఎఫ్2’

ఈ ఏడాది వచ్చిన రెండు సినిమాలూ మంచి కలెక్షన్లను సాధించాయి. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ని సొంతం చేసుకున్నాయి.

2020  - ‘అల వైకుంఠపురంలో’,  ‘సరిలేరు నీకెవ్వరు’

రవితేజ ‘క్రాక్’; రామ్ ‘రెడ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇందులో క్రాక్, రెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టాయి. అల్లుడు అదుర్స్ కాస్త నిరాశపరిచింది.

2021 - ‘క్రాక్’

నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన రెండో చిత్రం ‘బంగార్రాజు’. ఈ చిత్రం 2022 సంక్రాంతి సీజన్‌ని బుట్టలో వేసుకుంది. మరోవైపు, రౌడీ బాయ్స్, ‘హీరో’ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి.

2022 - ‘బంగార్రాజు’

చిరంజీవి, బాలకృష్ణ మరోసారి సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. వీరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

2023 - ఏ సినిమానో?

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ కూడా ఇదే సమయానికి వస్తోంది. తెలుగులోకి డబ్ అవుతున్న విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ సినిమాలు ఏ మేరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.