ఎన్నో అంచనాల మధ్య సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురుచూసింది. దీనిపై భారత ఆటగాళ్లు, మాజీలు వివిధ రకాలుగా స్పందించారు.
ఇది కచ్చితంగా బౌలింగ్ వైఫల్యమే. మావాళ్లు బంతిని తిప్పలేకపోయారు. ఒత్తిడిని జయించలేకపోయారు. ఒత్తిడిని తట్టుకోవడం ప్రత్యేకించి ఎవరికీ నేర్పించలేం. పిచ్ బ్యాటింగుకి అనుకూలమే కానీ, మరీ 16ఓవర్లలో ఛేదన ముగించేదైతే కాదు
రోహిత్ శర్మ
కష్టపడిందంతా భూస్థాపితం అయింది. మొత్తం నాశనమైంది. క్షోభ మిగిలింది. ఈ ప్రయాణంలో మాకు సహకరించిన అభిమానులకు, సహాయక బృందానికి ధన్యవాదాలు.
హార్దిక్ పాండ్యా
పిచ్‌పై 180-185 పరుగులు చేస్తే బాగుండేది. పిచ్ నెమ్మదిగా ఉందని బ్యాటర్లు చెప్పారు. బహుశా ఓ 20 పరుగులు వెనకపడ్డామేమో. అవును మేం ఆశించిన మేర రాణించలేదు. ఇందులో లోపాలను గుర్తించి మెరుగవ్వడానికి ప్రయత్నిస్తాం.
రాహుల్ ద్రవిడ్(కోచ్)
నాణేనికి రెండు దిశలుంటాయి. సరిగ్గా జీవితానికీ ఇదే నప్పుతుంది. టీమిండియా గెలిస్తే మనమే విజయం సాధించినట్లు ఆనందపడతాం. అలాగే ఓటమికీ బాధ్యత తీసుకోవాలి. గెలుపు, ఓటమి ఒకదాని వెంబడి మరొకటి జరిగే ప్రక్రియ.
సచిన్ తెందుల్కర్
మైదానంలో అడుగు పెట్టిన ప్రతిసారి మన జట్టే గెలవాలని కోరుకుంటాం. కొన్నిసార్లు అలా కుదరకపోవచ్చు. అయినా మనవాళ్లు సమష్టిగా ఆడటం గర్వంగా ఉంది. బలంగా పుంజుకునే తరుణం ఆసన్నమైంది.
యువరాజ్ సింగ్
బంతిని భారత బౌలర్లు అర్థం చేసుకోలేదు. మరోవైపు, ఇంగ్లండ్ ఓపెనర్లు ఇరగదీశారు. ఇక్కడే జరగాల్సిందంతా జరిగింది.
వీరేంద్ర సెహ్వాగ్
అవును, మనవాళ్లు ‘చోకర్స్’ అనడంలో తప్పులేదు. కానీ ఒక్క మ్యాచ్‌ను పట్టుకుని మరీ తీవ్రంగా విమర్శించడం కూడా సరికాదు.
కపిల్ దేవ్
చాలా చెత్తగా ఆడారు. బౌలర్లు తేలిపోయారు. భారత్‌కు అసంతృప్తిని మిగిల్చే ఓటమి ఇది. దురదృష్టవశాత్తు పాకిస్థాన్‌తో మెల్‌బోర్న్‌లో మ్యాచ్ ఆడలేకపోతున్నారు.
షోయబ్ అక్తర్
ఓపెనర్లిద్దరూ గొప్పగా ఆడారు. మనవాళ్లు గట్టిగా శ్రమించారు. అది భీకర పోరే. కచ్చితంగా మనవాళ్లు ఈ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుంటారని నొక్కి చెబుతున్నా.
సురేశ్ రైనా
ఓడిపోవడం సమస్య కాదు. ఇంత దారుణంగా పరాభవం చెందడమే బాధిస్తోంది. ఆటలో ఎదురుగాలులు చాలా భయంకరమైనవి. మళ్లీ పుంజుకోవడానికి ఇదొక మంచి అవకాశంలా భావించాలి.
ఆనంద్ మహీంద్రా
ఐపీఎల్ బ్యాన్ చేయాలి. దానివల్లే ఇదంతా జరుగుతోంది. ఐపీఎల్ ప్రారంభమయ్యాక టీమిండియా ఒక్క టీ20 వరల్డ్‌కప్ గెలవలేదు. ఇలాంటి సమయంలో ధోనీ ఉండి ఉంటే బాగుండేది. కెప్టెన్ కూల్‌ని బాగా మిస్సవుతున్నాం.