క్రికెట్‌లో సెంచరీ వీరులు...  సచిన్ రికార్డును బద్దలు కొడతారా?

క్రికెట్‌లో సెంచరీ చేయడమంటే సాధారణ విషయం కాదు. ఎంతో శ్రమిస్తే తప్ప శతకం బాదలేం. కానీ, కొందరు దిగ్గజాలకు మాత్రం ఇది మంచినీళ్ల ప్రాయమే. అలవోకగా సెంచరీలు బాదేయగలరు. వారిగురించే ఈ కథనం.

సెంచరీలనగానే ముందుగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ పేరే గుర్తొస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు పూర్తి చేసి ‘శత శతకాల’ వీరుడయ్యాడు. ఈ రికార్డు ఇంకా సచిన్ పేరుమీదే ఉంది. సచిన్ తర్వాత 71 శతకాలతో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు.

సచిన్, పాంటింగ్‌ల శకం ముగిసినందున వీరి రికార్డును చేరుకునేందుకు కొందరు వర్తమాన ఆటగాళ్లు ఉవ్విల్లూరుతున్నారు. కెరీర్ ముగిసేలోపు ఈ ఫీట్‌ని సాధించే దిశగా పయనిస్తున్నారు. మరి వారేవరో తెలుసుకుందామా..!

విరాట్ కోహ్లీ - 71

ఛేదనలో రారాజు విరాట్ కోహ్లీ. అభిమానులు ‘కింగ్ కోహ్లీ’ అని పిలుచుకుంటుంటారు. రెండేళ్ల నిరీక్షణ తర్వాత విరాట్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ టీమిండియా బ్యాట్స్‌మన్ రికీ పాంటింగ్‌తో సమంగా ఉన్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో కలిపి 71 సెంచరీలు చేశాడు. వర్తమాన ఆటగాళ్లతో పోలిస్తే సెంచరీల విషయంలో కోహ్లీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

ప్రస్తుతం విరాట్ వయసు 34 సంవత్సరాలు. మరిన్ని ఏళ్లపాటు కోహ్లీ కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఫిట్‌నెస్ కూడా అతడి కెరీర్‌కు ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది. ప్రయత్నిస్తే సచిన్ రికార్డుకు కోహ్లీ చేరుకోగలడు. ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించే సత్తా విరాట్‌ది. 2009లో ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకపై కోహ్లీ తన తొలి సెంచరీని నమోదు చేశాడు.

జో రూట్ - 44

సంప్రదాయ క్రికెట్‌కి ‘జో రూట్’ పెట్టింది పేరు. టెక్నిక్‌, టైమింగ్‌తో మైదానంలో రూట్ పరుగులు రాబట్టగలడు. అందుకే ఇంగ్లాండు క్రికెట్‌లో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు.  టెస్టుల్లో రూట్ చెరగని ముద్ర వేశాడు.

టెస్టులు, వన్డేల్లో కలిపి ఈ ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ 44 సెంచరీలు చేశాడు. టీ20ల్లో సెంచరీ చేయడం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే, వయసు రీత్యా రూట్(31) చిన్నవాడే కాబట్టి కెరీర్‌లో మరిన్ని సెంచరీలు చేసే అవకాశం ఉంది.

డేవిడ్ వార్నర్ - 44

డేరింగ్& డ్యాషింగ్ బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్ డేవిడ్ వార్నర్. ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ ఖాతాలో ప్రస్తుతం 44 సెంచరీలున్నాయి. టీ20ల్లో వీరంగం సృష్టిస్తూ.. టెస్టుల్లో బాధ్యతాయుతంగా మెలుగుతూ.. వన్డేల్లో నిర్మాణాత్మకంగా ఆడగల నైపుణ్యం వార్నర్ సొంతం.

కెరీర్ పరంగా వార్నర్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. కానీ, ఏడాదిలోగా టెస్టులకు గుడ్‌బై చెబుతానని ప్రకటించి ఫ్యాన్స్‌ని నిరాశపరిచాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో వార్నర్ ఎన్ని సెంచరీలు చేయగలడో వేచి చూడాలి.

రోహిత్ శర్మ - 41

టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ ఆడుతుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. టెస్టుల్లో పెద్దగా రాణించనప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదిగాడు.

హిట్‌మ్యాన్ ఖాతాలో ప్రస్తుతం 41 సెంచరీలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. వయసు రీత్యా(37) చూస్తే బహుశా రోహిత్ శర్మ ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. ఈ స్టైలిష్ బ్యాట్స్‌మన్ నుంచి మరో రెండు, మూడు సెంచరీలను ఆశించొచ్చు.

స్టీవ్ స్మిత్ - 40

స్ట్రైక్ రేట్ గొప్పగా లేకున్నా.. నిలకడైన ఆటతీరుతో రికార్డుల సాధించగల ప్లేయర్ స్టీవ్ స్మిత్. కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్‌కు మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉంది. ప్రశాంతంగా ఆడుతూ పని పూర్తిచేయడం ఈ బ్యాట్స్‌మన్ విలక్షణత.

స్టీవ్ స్మిత్ ఖాతాలో 40 సెంచరీలున్నాయి. వీటిల్లో ఎక్కువగా టెస్టుల్లో చేసినవే. వన్డేల్లో 12 సెంచరీలు బాదగా, టీ20ల్లో ఒక్క సెంచరీనీ నమోదు చేయలేకపోయాడు. 50 సెంచరీల మార్క్‌ని స్మిత్ చేరుకునే ఛాన్స్ ఉంది.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం  వెబ్‌సైట్‌ని చూడండి.  కింద లింక్‌ని క్లిక్ చేసి యాప్‌ని  డౌన్‌లోడ్ చేసుకోండి.