YouSay Short News App

తెలంగాణకు త్వరలోనే  వందేభారత్ ఎక్స్‌ప్రెస్

‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’, ఈ సెమీ హైస్పీడ్‌ ఎలక్ట్రిక్‌ ట్రైన్స్‌ను భారత ప్రభుత్వం 2019 ఫ్రిబ్రవరి 15న ప్రారంభించింది.

‘మేకిన్ ఇండియా’లో భాగంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించిన విడి భాగాలన్నీ పూర్తిగా మనదేశంలోనే తయారవుతున్నాయి. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తున్నారు.

ఒక్కో వందేభారత్ రైలు తయారీకి దాదాపు రూ.100 కోట్లు ఖర్చు అవుతోంది. దాదాపు ఏడాదిన్నర కాలంలో ఇది పూర్తవుతోంది.

వందే భారత్ రైళ్లు గరిష్ఠంగా 160 కి.మీ వేగంతో ప్రయాణించగలవు. ప్రస్తుతం 130 కి.మీ వేగంతో పరుగెడుతున్నాయి. ట్రాక్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రైళ్లు గరిష్ఠ వేగంతో నడుస్తాయి.

ఈ ఏసీ రైల్లో దాదాపు 16 బోగీలు ఉంటాయి. ప్రయాణికుల కోసం వైఫై, ఆహారం అందుబాటులో ఉంటుంది. వీటికి ప్రత్యేకించి చెల్లించాల్సిన పనిలేదు. టికెట్‌ ధర చెల్లిస్తే చాలు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు రూట్లలో వందేభారత్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి.

న్యూఢిల్లీ-వారణాసి

న్యూఢిల్లీ-శ్రీమాతా వైష్ణోదేవి కాత్రా

న్యూఢిల్లీ-అంబదౌరా

ముంబై సెంట్రల్- గాంధీనగర్

సౌత్‌ ఇండియాలో కూడా రైల్వే శాఖ వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టింది. చెన్నై-మైసూరు మధ్య నవంబర్ 11న ప్రారంభించింది. దక్షిణాన మొట్టమొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే.

తెలంగాణలో కూడా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈ సర్వీస్ ప్రారంభించాలని భావిస్తోంది. దీనికి అవసరమైన రైల్వేట్రాక్ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే పచ్చజెండా ఊపిన కేంద్రం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సుందరీకరణకు దాదాపు రూ.700 కోట్లు కేటాయించింది.